నిజం..నిర్భయం

Tuesday 25 January 2011

నవీన భారతదేశపు నయా దళితుడ్ని నేను!

నా ధర్మం మీద మమకారం చావక
తెల్లపంచా, జంధ్య౦ వేసుకున్నానే కానీ
వాస్తవానికి  నేను ఆకలి అగ్నికీలకల్లో దహించుకుపోతూ
మృత్యుకోరలకి చిక్కి కాలే కడుపుతో విలవిల్లాడుతున్నవాడిని.
అగ్రకులం, ఆధిపత్యం, కడుపు నిండిన వాడు అని 
నన్ను పరిహసించే మాటలు  ఆ మనువు కాలం నాటివి!
  
అరుంధతి నా ఇంటి కోడలైన రోజే వరసలు కలుపుకున్న వాళ్ళం
నీ కుల కవి పదపాదానికి 
మా తాత గండపెండేరం తొడిగిన రోజునే 
బంధుత్వాన్ని  పెంచుకున్నవాళ్ళం
నీతో నే కలిసి నడవాలని నే తొందర పడ్తుంటే
నా మీద ఇంకా ఆరని ద్వేషమెందుకు?

నిష్టూర మన్పించినా నిజ౦ చెప్పక తప్పట్లేదు
గాయత్రి సాక్షిగా నాదీ చినిగిన బతుకే
కడుపు నిండని వాడెవడైనా దళితుడే! 

శాస్త్రం చెపితే శాస్త్రినని, కర్మ చేస్తే శర్మనని 
అనుకున్నానే కానీ 
అది కులభూషణం అనుకోలేదు.
కాదు అది కులమే అని గగ్గోలు పడితే 
నా పేరులో అది కూడా తెంచేసుకున్నా!

గుండెపట్టని బాధ నాకూ ఉంది
కడుపు నింపని శ్రాద్దాలు పెట్టుకుంటూ
మంత్రాన్ని నమ్ముకున్న వారసత్వం నాది.
స్టేషన్లో రైలాగ్గానే 
"అపరకర్మలు చేయిస్తారా బాబుగారూ" అంటూ 
ప్రయాణికుల్ని చుట్టుకుని
ఎన్ని అవహేళనల్ని బాధతో భరించానో 
నా జీవితాన్ని కాటేసిన తెల్లతాచుకు తెల్సు...
చిరిగిన పంచె, మాసిన తువ్వాలు ఉతుక్కోవడానికి 
మారుపంచలేని 
కులాగ్రపేదరికం నాది.  
ఈ శ్రాద్దాల రేవులో 
ఎన్ని ఉదయాలు కన్నీటిచుక్కలై ఇంకిపోయాయో..!
అవహేళన, అవమానాల చాటున బతుకీడుస్తున్న వాడెవడైనా దళితుడే.

ఖేర్లాన్జీ సామూహిక వధలో 
కారంచేడు కార్పణ్య౦లొ 
చుండూరు అమానుష సంహారంలో  
నా పాత్రేంటి అని నాతరం నిగ్గదీసి అడుగుతోంది!


రాముడు, రామచరిత వాల్మీకి మా వాడు కాదే
అయినా రాముడి కోసం రావణుడు మా వాడన్నాం
కులం ఏదయినా గుణం ప్రధానమని!
అయినాకూడా ఈ నయా దృతరాష్ట్ర కౌరవసంతానం 
కులజాడ్య కత్తులు మాపై ఝులిపించక మానలేదు
ఇదెక్కడి కబోది న్యాయం?

ఈ క్షమాపణ, సంజాయిషీలు  ఇక చాలు 
నా తరానికి, మలి తరాలకి వాటిని మోసే అవసరం, ఓపిక ఇక లేదు. 
నిజాలు నిక్కబొడుచుకుంటున్నాయి
స్వార్థపూరిత సృష్టితమైన వాస్తవాలు సద్దుమణిగే రోజు వస్తుంది!

గౌరవ గండపెండేరాలు
జాలి reservations
ఇవేమీ అక్కర్లేదు నాకు 
మనిషి మనిషిగా బతకడానికి కాసింత మంచితనం కావాలి
నా బాధను పంచుకుని అక్కున చేర్చుకునే వారు రావాలి.
నీతీ,నిప్పులు లాంటి కడుపుని౦పని 
మాటలు కాకుండా వాస్తవాలనెరిగిన అభిమానం కావాలి. 
వీటికై చేస్తాం పోరాటం!
ఇదే తర్వాతి తరాలకి అందించే గొప్పబహుమానం!
నిజానికి ఇప్పుడు నేనూ 
నాలాంటి ప్రతి ఆకలి జీవి దళితుడే!

ఈ జాడ్యాలు నా తరంతో అంతరించి పోవుగాక!




[Inspiration squeezed and heartened on and by Are Brahmins the Dalits of today? | The Mouths that Recited Vedas are Grieving ]

6 comments:

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) said...

Excellent. I accept your feelings.

చదువరి said...
This comment has been removed by a blog administrator.
సాపాటు సమగతులు said...

@ఖండవల్లి గారు
ధన్యవాదాలు

@చదువరి గారు
మా బ్లాగులోకి ఆహ్వానం. నా ఆవే(రో)దన దేహీలు, దాసోహాలు ఆపమని, వాస్తవాలు తెలుసుకొమ్మని లెండి!

వోలేటి గారు జ్యోతిగారి బ్లాగులో అన్నట్లు "కూర్చున్న కొమ్మని నరుక్కునేంత" గొప్పవాళ్ళు కొంతమంది బ్రాహ్మలు. బహుశా ఇది నాటి పరమానందయ్య శిష్యులలో ఒకరి పరంపరేమో! ఒకవేళ కీర్తికండూతికైతే ఇచ్చేద్దాం వీరరత్నాలు మరి! కానీ ఈ రత్నాలు తర్వాతి తరాలకి ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా?

ఇక మీరిచ్చిన గొలుసుకొస్తే,
1996-97 ప్రాంతలో సాయిప్రసాదుగారు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ "పొగమంచు" పుస్తకం ఇచ్చారు. అప్పుడు చదివినప్పుడు ఇదే వాస్తవమేమో అనిపించింది, నేను పుట్టిపెరిగిన పరిస్థితులు దానికి భిన్నం అయినా. కానీ అది పదేళ్ళకిందటి మాట. నేటి సమాచారవిప్లవంలో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి, బమ్మి తిమ్మి అవుతుంది.

నేను ఫ్రాంకోయిస్ గారు రాసిన "దళిత బ్రాహ్మణ" వ్యాసం చదివిన తర్వాత ఒక టపా రాద్దాం అనుకు౦టన్నపుడే, బ్లాగుల్లో కొన్ని వికృత భావాల మురికి మొరుగుడు టపాలు వచ్చాయి. సరిగ్గా నే పదేళ్లక్రితం చదివినది గుర్తుకు వచ్చి అందులో నాకు కావాల్సిన భావాన్ని తీసుకుని నేటి పరిస్థితులకి తగ్గట్లుగా రాశా! ఇంకా రాస్తా కూడా.. దీవించండి :)

శ్రీవాసుకి said...

రాజేష్ గారు

మీ కవిత బాగుంది. అందులోని వ్యధ హృదయాన్ని తాకింది.

Bhardwaj Velamakanni said...

Cool thing

tankman said...

చాలా బాగుందండి కవిత...చదవగానే స్వర్ణకమలం మూవీ లో హీరోయిన్ తండ్రి పెన్షన్ కోసం govt office కి వెళ్ళిన సీన్ గుర్తొచ్చింది.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers