నిజం..నిర్భయం

Friday 27 May 2011

ఈ వారాంతపు వల్లకాడు లొల్లి ఏందిరో! శవాల్ని మేల్కొలపండిరో.. అల్గేలే..;)

ఈ వారాంతంపు వల్లకాడు లొల్లి ఏందిరో! బలిసిన కుల ముష్కరమూకల శవాల మూలశంక గోలే౦దిరో!



ఒక బ్లాగరు రాసిన సొంత అభిప్రాయాన్ని వారికి సంబంధించిన సమూహానికంతటికీ ఆపాదించి వల్లకాడులొ వారాంతపు చితిమంట పెట్టి బలిసిన కుల ముష్కరమూకల శవాల్ని లేపుతూ లొల్లి మొదలెట్టాడు. తను వారాంతమంతా చుట్ట వెలిగించుకోవడానికి బ్రాహ్మణులు, దళితుల మధ్య కాష్టం రగిలించడంలో తెగకష్టపడుతూ మూతి కాల్చుకుంటున్నాడు. ఇక ఆ రెండు కులాల మధ్య తమ తాతలు,ముత్తాతలు చేర్చిన చితిమంట ఆరనీకుండా ఓ బలిసిన కుల ముష్కర శవమూక కరాళనృత్యం చేయడానికి సిగ్గు, లజ్జ వదిలేసి అనామకుల రూపంలో ఎగబడుతున్నారు. ఈ కుల ముష్కర మూకలకి ఇంత అశుద్ద మాదాకవళం వేస్తూ వారాంతపు లోల్లిని వెల్లదీస్తున్న ఓ అగ్నాని. ఇవే కుల ముష్కర మూకలు ఇదే అగ్నాని అధమవల్లకాడత్వంలో నాకు, భాస్కరరామి రెడ్డి గారి మధ్య అగ్గిరాజేసి, ఆంధ్రాలో మీరు మాకు బంధువులు, మేము మీకు శ్రేయోభిలాషులు అని చెప్పుకునే రెండు కులాల మధ్య ఉన్న పచ్చగడ్డిమీద చిచ్చుపెట్టే ప్రయత్నం  ఇక్కడ కూడా చేసారు.

ఇక ఇప్పుడు ఆ వారాంతపు వల్లకాడులో లొల్లిచేసేది దళితులు ఆపైన బ్రాహ్మణులు అని అనుకుంటే కుత్సితకుల చితిలో కాలేసినట్లే!

తమ ముందు తరాలు బ్రాహ్మణ, దళితుల మధ్య పేర్చిన చితిని అనాగరిక అశుద్ద వారసత్వంగా స్వీకరించి, పీనుగు ఎప్పుడు దొరుకుద్దా! ఎప్పుడు పీకుతిందామా! అని గోతికాడనక్కలా ఎదురుచూస్తూ ఉన్న ఈ బలిసిన కులముష్కర మూక దళితవాదం పాడుతుంది. ఎందుకు? దళితుల మీద ప్రేమా? కానేకాదు.. కేవలం బ్రాహ్మణులని మట్టుపెట్టే తమ అశుద్దవారసత్వాన్ని కొనసాగించడానికి. దళితులారా గుర్తుపెట్టుకోండి alienation is far-better than elimination అన్న కఠిన వాస్తవాన్ని. alienation ఖచ్చితంగా తప్పే..అందులో ఎలాంటి సందేహం లేదు..ఒప్పుకుంటా.. కానీ అదిప్పుడు వాస్తవంలో లేదు. వాస్తవ౦లో ఉన్నది కేవలం elimination. ఇది ఏ బలిసిన కులం చేసిందో, చేస్తుందో చూసుకోండి. దళితులపై జరిగిన ఖేర్లాన్జీ సామూహిక వధలో, కారంచేడు కార్పణ్య౦లొ, చుండూరు అమానుష సంహారంలో ఏ బలిసిన కులముందో తెలుసుకో౦డి. చితిమీద పీనుగుమాసం ముక్కలు ఏరుకుతినే ఈ బలిసిన కుల ముష్కర మూకలు మీకేదో మాట సాయం చేస్తున్నాయని నమ్మితే ఆనక అవసరం తీరాక అదే చితిమీద తొ౦గోపెట్టగలవు. తస్మాత్ జాగర్త! వర్తమానవాస్తవాలని గుర్తించి మీ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు ఇస్తారో లేక ఇలాంటి కుల కుత్సితి పీనుగుల తాత్కాలిక మద్దతుతో/మద్దతు కోసం గతాలకు గాయాలు చేసుకుంటూ విషవారసత్వాన్ని ఇస్తారో ఆలోచి౦చుకోవాల్సిన సమయం. తనమీద ఎంతో అభిమానం చూపించిన బ్రాహ్మణ ఉపాధ్యాయుడు "మహాదేవ అంబేద్కర్" గారి ఇంటిపేరుని తనఇంటిపేరుగా మార్చుకున్న భారతరాజ్యా౦గపిత, దళితదశదిశోద్దారకుడు అంబేద్కర్ గారి అభిమానాన్ని మరువగలామా?        

ఇక ఈ కులముష్కర మూకలకి అగ్నా(నా)యకత్వం వహించే వల్లకాడు వారాంతానికి ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరుగుతు౦టే తగుదునమ్మా అంటూ వారి మధ్య చితిపేర్చడానికి సిద్దం అయిపోతాడు. పీనుగులు వేదాలు వల్లించినట్లు నీతిసూత్రాలు చెబుతాడు. మరిప్పుడా పీనుగు సూత్రాలు ఏమయ్యాయి..కుత్సితాలయ్యాయా? ఏ.పి.మీడియా రాము గారు పేద్ద తరహాగా వచ్చి చర్చ పట్టు తప్పి రచ్చగా మారుతుంది జాగర్తగా మసలుకోండి అని మర్యాదగా చెబితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని తనదాకా వస్తే గానీ అన్నట్లు కుత్సితనీతిని ప్రదర్శించాడు. చెత్తకామెంట్ల రచ్చ తప్ప ఏమీ లేదని శ్రీనివాస్ గారు చెబితే తన చెత్త మిగిలిన బ్లాగుల చెత్తకంటే ఎక్కువ కాదని చెప్పుకొచ్చి తన అగ్నానాన్ని రుజువుచేసుకున్నాడు. నిస్సిగ్గుగా చెత్త ఉందని ఒప్పుకుంటూనే,  తాను అనుమతిస్తేనే ఆ చెత్తవచ్చిందన్న విషయాన్ని తనకనుగుణంగా అలవోకగా నిర్లజ్జతో వదిలేసాడు. చూసేవారు కబోదులు కదా మరి ఈయన దృష్టిలో! పోనీ టపాలో ఏవైనా అర్థవంతమైన చర్చ పెట్టాడా? అదీలేదు. కేవల౦ కులాన్ని దూషించే వ్యాఖ్యలను ప్రేరేపిస్తూ, ఆ కులగజ్జిగాళ్ళకి  వెన్నుదన్నుగా నిలుస్తూ  తన వాతప్రకోపాల్ని చూపించే వారాతం ఎంచక్కా దినాంతం చేసుకుంటున్నాడు.

చివరిగా, అయ్యా పెద్దలూ..

తప్పు తప్పే..దాన్ని ఒప్పు చేయాల్సిన అవసరం లేదు..సమర్థి౦చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ తప్పుని మరో మంచి ఒప్పుతో తుడిచేయడ౦ లేదా చేసిన మంచిని ఎలుగెత్తడం సరైన పరిష్కారం. ఈ పరిష్కారమార్గాన్ని అమలుకానీకుండా అడ్డుపడుతున్న ఆ బలిసిన కుల కుత్సిత౦ గురించి చెప్పండి..ఎండగట్టండి. అలాగే నేడు కులగజ్జిని వాస్తవానికి ఎవరుపెంచి పోషిస్తున్నారో చెప్పండి. అంతేకానీ ఇప్పటికే ఎపుడో కొంతమంది చేసినవాటికీ, చేయనివాటికీ తమకు  తెలీకుండానే బాధ్యత వహిస్తూ స్వయంకృతాపరాధంగా తమకూ, దళితులకూ మధ్య సృష్టించుకున్న అగాధాల్ని మరింత పేద్దవి చేయద్దు.ఒక్కసారి వర్తమాన వాస్తవాల్ని చూస్తూ మీ భవిష్యత్తుతరాలకి "ఈ" రాతలతో ఏమి ఇద్దామనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి! తరగని తలంటులూ, తొలగని అపవాదులు మరియు అంతులేని అవమానాల తోడు క్షమాపణలా?            

Thursday 26 May 2011

ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను!

ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను
దీని రమ్యమైన అందాలతో పాటు - మూర్ఖత్వాన్నీ
దీని సమానత్వ సిద్ధాంతాలతో పాటు - చేతకానితనాన్నీ
అన్నింటినీ కలిపి ఈ దేశాన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను
ఇది
గోల్డు మెడళ్ళను మెరిట్ సర్టిఫికేట్లను పక్కకు నెట్టీ
కుల ధ్రువీకరణ పత్రాలకు ప్రాముఖ్యం ఇచ్చినా సరే
దీన్ని నేను ప్రేమిస్తూనే ఉన్నాను


ఉద్యోగాల మీద కులాల పేర్లు చెక్కి
ఇది నా ప్రతిభను పాతాళానికి తొక్కి ఉండొచ్చుగాక
నా తొంభై శాతం మార్కులు పనికి రావని తేల్చి
క్వాలిఫై కొసనందుకోలేని మోడు మొదళ్ళకు
నౌకరీలు పంచేందుకు ఉత్తర్వులు జారీ చేసి ఉండొచ్చుగాక
STILL I LOVE MY COUNTRY

ఇది ప్రమాదపువలను పసిగట్టలేని అంధ కపోవతం
రిజెర్వేషన్ కాల పరిమితిని రెట్టింపు చేసుకుంటూ
నా జీవితాన్ని చింపిన విస్తరి చేసిన గ్రామసి౦హం
బతుకును వెలుగుగా మార్చుకోడానికి
ఫలానా కులం లోనే పుట్టాలని నిర్దేశించి
ఇది నా గొంతులో కపట ప్రేమను వడ్లగింజగా వేసింది
చదువులకీ ఉద్యోగాలకీ నాపై నిషేదం విధించి
కడుపులో ఆరని చిచ్చురేపింది
శాంతి మంత్రోచ్చారకుణ్ణి కదా !
నా బ్రతుకు అవమానాల అగ్నిగుండం చేసినా
దీన్ని సహనంతో తల్లిలా ప్రేమిస్తూనే ఉన్నాను


ఇది పతివ్రత వేషం వేసుకున్న పూతన
నాకు పలకా బలపం కొనివ్వలేని బీద పలుకులు పల్కి
కొందరికి ఉచిత భోజన వసతులతో హాస్టళ్ళు కట్టిస్తుంది
నా చదువుకు కాలేజీల్లొ సీట్లు లేవనిచెప్పి
కొందరికి కోటాలుగా వాటాలేసి పంచుతుంది
జీవితంలో పావు భాగం దాటగానే
నా వయస్సును ఉద్యోగానికి అనర్హతను చేసి
కొందరికి మాత్రం
వయోపరిమితికి సడలింపుమీద సడలింపులిస్తుంది
ఫిర్ భీ దిల్ హే హిందుస్తానీ

ఏ ప్రాంతమేగినా ఎందుకాలిడినా
తల్లి భారతిని పొగడటం మర్చిపోనివాణ్ణీ
నిండా మునిగినా నిండు గుండెతో
వందేమాతర గీతాన్నై ధ్వనించిన వాడ్ని
ఈ మట్టి పై మమకారం పెంచుకొని
తుపాకి ముందు గుండెను నిల్పిన వీరుడ్ని
ఇన్నీ అయినందుకు నా మొఖానికి ఏ రాయితీ ప్రకటించగ పోగా
నా మెడలో దారిద్రాన్ని మూర్చబిళ్ళగా వేలాడదీసింది
అయినా దీన్ని నేను ప్రేమిస్తూనే ఉన్నాను

కానీ
దీన్నిలా మరుగుదొడ్డిలా మార్చిన నాయకుల్ని ద్వేషిస్తున్నాను
మనుగడను ధ్వంసం చేసి పదవి నిలుపుకుంటున్న
నీతిమాలిన చర్యను నిరసిస్తున్నాను
ఇక - రాజ్యాంగం వొంకర నుదిటిపై సవరణ చట్టం తిలకమైన రోజున
జాతీయ గీతం పాడినంత ఉద్వేగంతో
మా నాయకులు నపుంసకులు కాదని
కొత్త ప్రకటన చేస్తాను!!!


-ఒక "సత్యం" చెప్పిన గుండెకోత సత్యం.

Friday 13 May 2011

పశ్చిమాన అరుణవర్ణం పదవీ కాంక్షతో భంగపడి అస్తమించింది.

ముప్పైనాలుగేళ్ల(34) అప్రతిహతమైన వామపక్షపాలనకు తార్కాణంగా నిలిచిన పశ్చిమబెంగాల్ ఎర్రకోట నేడు బీటలు వారింది. 


సూచన: టపా పొడవు అయినందువల్ల చదువరుల సౌకర్యార్ధం పేరాలుగా విడగొట్టి ప్రతి పేరాని గొలుసులుగా ఇవ్వడమైనది. గొలుసుని పేరా చూడ్డానికి, మూయడానికి ఉపయోగించగలరు. అన్ని పేరాలు ఒకేసారి చూడ్డానికి "Show All" అన్న గొలుసు నొక్కండి. మీకు ఏదేనీ పనిచేయకపొతే rajeshgottimukkala@gmail.com కు ఉత్తరం పంపగలరు. 

నాకున్న రాజకీయపరిజ్ఞాన౦, శోధించి తెలుసుకు౦టున్న చరిత్ర ఆధారంగా పశ్చిమబెంగాల్లోని వామపక్షపార్టీ ఉత్తాన-పతనాలపై సింహావలోకనం.

పశ్చిమబెంగాల్(ప.బె) గురించి టూకీగా:

భారతదేశం ఆంగ్లేయుల పరిపానలో ఉన్నప్పుడు తూర్పుతీర ప్రాంతాల్లో అనగా ప.బె, అస్సామ్, బీహార్ మరియు ఒరిస్సాల్లో తమ పరిపాలనా సౌలభ్య౦లో భాగంగా అనేక పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి పరిచింది. కలకత్తా ఓడరేవు పట్టణంగా వాణిజ్యరంగానికి ప్రసిద్దిచెందింది. 1950 చివరిదశకం వరకూ భారతదేశ ఆర్ధికరాజధానిగా కలకత్తా భాసిల్ల్లింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ౦ ప.బె లో ఎన్నోరకాల పరిశ్రమలు ఏర్పరిచి మరింతగా అభివృద్ధి పరిచింది.

       Show All

వామపక్షపార్టీ రాజకీయ ప్రస్థాన౦

పేద,బలహీనవర్గాల వారి హక్కులను పెత్త౦దారీ భూస్వాముల నుంచి కాపాడ్డానికి సమసమాజనిర్మాణమే లక్ష్యంగా, తుపాకీ ఆయుధంగా ఏర్పడిన నక్సలిజం తదననతరం, అన్నివర్గాల ప్రజలతో మమేకం అవ్వడానికి తుపాకీ పొత్తు కుదరదని గ్రహించి౦ది. పేద, శ్రామిక వర్గాల హక్కులకోసం ధనిక, పెట్టుబడి వర్గాలతో పోరాడ్డమే ముఖ్యసిద్ధాంతంగా ఏర్పడిన మార్క్సిజం మూలాలతో వామపక్షభావజాలంగా శ్రీ జ్యోతిబసు, శ్రీ ప్రమోద్దాస్ గుప్తా వంటి నీతి,నిజాయతీ గల నేతల సారధ్యంలో క్రియాశీలక రాజకీయాల్లోకి CPI అనే పేరుతో పార్టీగా ఆవిర్భవించింది.


ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజాశ్రేయస్సు కొరకై ఏర్పరచిన సిద్దాంత౦ మూలాలు ఎంత మంచివే అయినా వాటిని ఆచరిస్తున్నామంటూ కొందరు ఆ సిద్దాంతాలని తమ స్వార్థానికి వినియోగించడం వల్ల ఆ మూలాల ఉనికికే ముప్పు వస్తుంది. ఇక్కడా అదే జరిగింది.                  

ఇక వామపక్షభావాలను సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, వారిని పార్టీ వైపుకి ఆకర్షి౦చాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఈరోజుల్లో అయితే ధన౦బలం ఇత్యాది వక్రమార్గాలు చాలాఉన్నాయి. అప్పట్లో ప్రజలవైపు, వారి సమస్యలని పరిష్కరించే వైపు నిజాయితీగా పోరాడ్డమే ఆకర్షణ. ఆదే పోరాటతత్వంతో ఏర్పడిన వామపక్షం తొలుత ప్రజల్లోకి తమ భావాలను నెమ్మదిగా చొప్పించే ప్రయత్నం చేసింది. అయితే పోనుపోను సమస్యల వైపు పోరాడ్డం కాకుండా కేవలం తమ భావాలను ప్రజలమీద బలవంతంగా రుద్దడానికి, పార్టీని ఏవిధంగానైనా అధికారంలో రావడానికి దృష్టి పెట్టి కొన్ని చెడుమార్గాలు తొక్కింది. వాటిలో ముఖ్యంగా తమ పార్టీ కార్యకర్తలను తప్ప మిగిలినవారిని పెట్టుబడి దారులుగా, అమెరికా సానుభూతి పరులుగా, CIA గూఢచారులుగా, ప్రజావ్యతిరేకులుగా, పేద/శ్రామిక వ్యతిరేకులుగా ముద్ర వేస్తూ తాము మాత్రమే పేదవారి తరపున పోరాడేవారమని చెప్పే ప్రయత్నం చేసింది.

అయితే ఎన్నుకున్న మార్గం వక్రమైనదైనా అసలు ఉద్దేశ్యం మంచిగా ఉండడంతో పేదప్రజల మీద అధ్బుతంగా పనిచేసింది. అదే ఊపుతో 1962 లో ప.బె అసెంబ్లీలో మూడొ౦తుల బలాన్ని తెచ్చుకుంది. అయితే ఇక్కడ కోతికి కొబ్బరికాయ దొరికిన చందం అయింది. వారు తమకి మద్దతునిచ్చిన ప్రజలను, వారి సమస్యలని గాలికొదిలేసి పూర్తి బలాన్ని తెచ్చుకుని అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళురారు. తమ మూలాల్ని మరిచారు.. తంపుల పుంతలు తొక్కారు.

మారిన సిద్దాంతం-మార్క్సిజ౦ నుంచి  అతివాద౦(ఫండమెంటలిజం) వైపు:

అందులో భాగంగానే కిందపేర్కొన్న వాటిని తమ నినాదాలుగా పేర్కొంటూ, కార్యకర్తలను యుద్ద సైనికులుగా తయారుచేస్తూ వామపక్షవాద మూలాల్ని కొద్దికొద్దిగా వదిలేస్తూ మార్క్సిజాన్ని ఫండమెంటలిజం దిశగా తీసుకువెళ్లడం మొదలుపెట్టారు.

౧.అధికారం అనేది బలప్రయోగం లేదా తుపాకీ ద్వారానే వస్తుంది
౨.అవసరమైతే చట్టాన్ని అతిక్రమి౦చాలి
౩.ప్రజాస్వామ్యం కేవలం పెట్టుబడిదారులది

అదంతా ఒక ఎత్తయితే 1962 లో చైనా భారతదేశం మీదకి దండెత్తివచ్చి హిమాలయాల భూభాగాన్ని పెద్దమొత్తంలో ఆక్రమించినపుడు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయపౌరుడు ఆ దాడిని తిప్పకోట్టలేని భారతదేశ ప్రభుత్వం మరియు సైన్య౦ అసమర్థతను ఎండగడుతుంటే ఒక్క వామపక్షవాదులు, వారి అనునూయులు మాత్రం దాన్ని చైనా విజయంగా చెబుతూ చైనా మాత్రమే శ్రామికవర్గాలకు మద్దతుగా ప్రపంచదేశాలతో పెట్టుబడిదారుల మీద పోరాడగలదనే కబోది అభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భ౦గానే "చైనాలో వర్షం పడితే ఇక్కడ వామపక్షవాదులు గొడుగు పడతారు" అనే జాతీయానికి అంకురార్పణ జరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ వి౦తకబోది నమ్మకం ఇప్పటికీ కొనసాగుతూ మొన్న సిక్కి౦, అరుణాచల్ మీద చైనా కాలుదువ్వినా ఏమీ మాట్లాడకుండా గుడ్డికి తోడుగా మూగతనాన్ని ఆభరణంగా తెచ్చుకుంది.

ఇక 1963లో రష్యా, చైనా మధ్య బేధాలు పొడసూపినప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్న చందాన విచిత్రంగా పేద/శ్రామిక వర్గాల కొరకై పోరాడాలన్న మూలసిద్దాంతాలను వదిలి తాము కొత్తగా ఏర్పరుచుకున్న సిద్దాంతాలకి విలువనిస్తూ భారత వామపక్షవాద పార్టీ(CPI) 1964 లో నిట్టనిలువుగా రెండు పార్టీలుగా చీలిపోయింది. ఒకటి CPI-రష్యాకి మద్దతు మరొకటి CPM-చైనాకి మద్దతుగా. ప్రపంచ౦లో ఏ దేశంలోని పార్టీ కూడా బహుశా ఇలా పక్కదేశాలకోసం అదీ వారి గొడవలకి మద్దతునిస్తూ విడిపోయిఉండదు :(. అది మొదలు అనగా 1967 నుంచి నేటివరకు ఎన్నికల్లో రెండుపార్టీలు విడిగానే పోటీ చేస్తూఉన్నాయి.

1967 లో జరిగిన ఎన్నికల యుద్దంలో ప.బె లో ఏ పార్టీకి ఒక్కరే ప్రభుత్వాన్ని స్థాపించే౦త బలం రాలేదు. అప్పుడు గాంధేయవాది అయిన శ్రీ అజోయ్ ముఖర్జీ గారు ముఖ్యమంత్రిగా, శ్రీ జ్యోతిబసు గారు ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్-వామపక్ష సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ప్రభుత్వం ఆట్టే సజావుగా సాగలేదు. వామపక్షవాదులు తమ వాదాన్ని ప్రజల్లోకి మరింతగా చొప్పించేందుకు చేతికి అందివచ్చిన అధికారాన్ని వాడుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పైకి శ్రామికులని రెచ్చగొట్టి నిరంతరం హర్తాళ్ళు, బందులతో ప.బె హడలి పోయేలా చేసింది. అభివృద్ధి కుంటుపడింది. చివరకి 1969 లో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుపరిచి రాష్ట్రపతి పాలన విధించారు.


అర్రులుచాచిన పదవీకాంక్ష:

అంతే! దీనితో వామపక్షవాదులు మరింతగా రెచ్చిపోయారు. తమ పార్టీ కార్యకర్తలను పెంచుకుని మిగిలిన ప్రజలని ప్రభావితం చేసే ఉద్దేశంతో ఇతర వా.ప.వాదులతో గొడవలకి దిగారు. సొంత సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పదవీకా౦క్ష పోరాటాల్లో ఏంతోమంది ప్రాణాలు బలిపశువులుగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదేసమయంలో ఫార్వార్డ్ బ్లాక్ ముఖ్యఅధ్యక్షుడిని నడివీధిలో కత్తులతో పొడిచి చంపారు. అప్పటినుంచి ఏదోఒక చావు వార్త ప.బె పేరు మీదుగా పత్రికల్లో రావడం నిత్యమైపోయింది.

ఇక 1969లో జరిగిన ఎన్నికల్లో CPM కి పూర్తి బలం సాధించి మిగలిన ఇతర వామపక్షపార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సొంత ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పట్టి నుంచి గొడవలు, లూటీలు మొదలయ్యాయి. అధికార సిద్దాంతం తప్ప పేదవాడు కనిపించడం లేదు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ గొడవ ప్రముఖంగా పైకి వచ్చింది. పెట్టుబడిదారుల మీద దాడులని ముమ్మరం చేసింది. అదే తమ సిద్ధాంతంగా చెప్పుకొచ్చింది చివరికి. కొన్ని సంవత్సరాలవరకు ప్రజలు ఈ గొడవలవల్ల నరకం అనుభవించారు..స్వేచ్చను కోల్పోయారు. చివరికి కేంద్రం 1971లో మళ్ళీ రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో కేంద్రం మీద అక్కసుతో వామపక్షవాదులు తమ విభాగాలతో కలిసి కుట్రలు పన్నాయి. అవి పలువురు కాంగ్రెస్స్ నాయకుల హత్యలకు దారితీసాయి. కాంగ్రెస్ పార్టీకి ఒకానొక సమయంలో ధైర్యంగా బయటికి వచ్చి తమ పార్టీ తరపున నిలబడేవాళ్ళు కూడా లేకపోయారు. అయితే 1973లో జరిగిన ఎన్నికల్లో బొటాబొటీ బలంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఓటమి వా.ప వాదులకి మింగుడుపడలేదు. వారి అధినాయకులకి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అప్పటికి అవగతమయింది. ప్రజలకి శాంతిభద్రతలు, స్వేచ్చాయుత జీవితం కోరుకుంటున్నారని అర్థం అయింది. ఇకనుంచి వామపక్షభావ జాలాన్ని హింసతో కాక శాంతిమార్గ౦లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే ఇది నచ్చని ఈ పార్టీలోని కొందరు పిడివాదులు "నక్సలిటాస్" పేరున చారుమంజుదారు అధ్యక్షతన మరో కొత్తపార్టీ పెట్టి CPM కి బద్దశత్రువులుగా తయారయ్యారు.

అది 1977.. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1975-అత్యయిక పాలన(ఎమర్జెన్సీ) దెబ్బతో ఉత్తరభారతదేశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, అలానే పశ్చిమ బెంగాల్లో కూడా. మళ్ళీ రాష్ట్రపగ్గాలు వామపక్షవాదుల చేతికి వచ్చాయి. శ్రీ జ్యోతిబసు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు ప.బె లో వామపక్షపాలన గత ముప్పైనాలుగేళ్ళుగా(34) నిరాటంకంగా నిన్నటివరకు కోనసాగుతూనే ఉంది.

ఇప్పుడు కాలంతో పాటు వా.ప ప్రభుత్వమూ మారి ప్రజలకు కావలసిన మౌలికఅవసరాలు, అభివృద్ధి గురించి మళ్ళీ ఆలోచించడ౦ మొదలుపెట్టింది. అయితే ఆ ఆలోచన హింసగా మారి హంసపాదుగా మిగిలింది. నందిగ్రామ్, సింగూర్లో నెలకొన్న హింసాత్మక సంఘటనలే దీనికి ప్రత్యక్షఉదాహరణలు.

వెరసి భారతవామపక్షపార్టీ తన చేష్టల వల్ల సగటు భారతీయులకి మార్క్సిజమంటే పేదల వ్యతిరేకి మరియు అభివృద్ధి నిరోధకులు అనే కొత్త అర్దాన్ని ఇచ్చి మార్క్సిజ౦ ఏర్పాటుకు మూలమైన హేతువు యొక్క పరమార్ధాన్ని తుంగలో తొక్కింది.

పారిశ్రామికిభివృద్ధి మందగించి నిరుద్యోగంతో అల్లాడుతున్న ప.బెకి 2000 సంవత్సరం నూతనఅధ్యాయం మొదలైంది. వామపక్షప్రభుత్వ ఉదారవాది బుద్దదేవ్ భట్టాచార్య గారు ప.బెల్లో పెట్టుబడులకు దారులు తెరిచారు. భారీస్థాయిలో పారిశ్రామికీకరణ ప్రణాళికలకి నాందీ పలికారు. అయితే ఈ ప్రయాత్నాలు ఒక పద్దతిగా కాకుండా ఇబ్బడిముబ్బడిగా, గందరగోళం మధ్య మొదలవ్వడంతో విఫలమయ్యాయి. దీని ఫలితంగా పైన ఉదాహరించిన సింగూరు, నందిగ్రాంలో వేలాదిమంది రైతులు భూములు కోల్పోవడమే కాకుండా నిరాశ్రయులయ్యి వీధినపడ్డారు. బాధితులంతా ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామికీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకదశలో పేదల జీవితాలతో ఆడుకుంటుందని పేరుతెచ్చుకున్న వామపక్ష ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడి సామాన్య ప్రజలు పెట్టుబడి భూతంగా చూస్తున్నారు.        


నవీన వామపక్షవాది - మమతాబెనర్జి గారు (దీదీ):

ఇదిలా వుండగానే సామాన్య ప్రజలందరి చేతా దీదీగా పిలువబడుతూ వారి హృదయాలకి చేరువైన మమతాబెనర్జీ గారి అధ్యక్షతన 1998లో ఏర్పాటైన తృణమూల్‌ కాంగ్రెస్‌ వామపక్షపార్టీకి బలమైన ప్రత్నామ్నాయంగా ఎదిగింది. అసలైన వామపక్షవాదానికి తాను ప్రతినిధిగా చెప్పుకుంటూ ప్రజలను౦చి మాత్రమే కాకుండా నక్సల్స్ వర్గాల నుండి కూడా మద్దతు సంపాదించుకోగలిగారు. అట్లే వామపక్షంపార్టీ తన అసలు మూలసిద్దాంతాలకి నిర్మూలం పలుకుతుండడం చూసి తట్టుకోలేని వామపక్ష సానుభూతిపరులు గణనీయమైన సంఖ్యలో దీదీ వైపు ఆకర్షితులయ్యారు. దీదీ వామపక్షపార్టీని వామపక్షవాదంతోనే ఎదుర్కొంటూ 2008 పంచాయతీ, 2009 సాధారణ ఎన్నికలు మరియు 2010లో కోల్‌కతా మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి వామపక్షపార్టీకి ముచ్చెమటలు పోయించి అయోమయానికి గురిచేసింది.  దీదీకి అడ్డుకట్ట వేసేందుకు వామపక్షపార్టీ చేసిన ప్రయత్నాలు వికటించి రెండు పార్టీల మధ్య రాజకీయ హత్యలతో రక్తపాతానికి దారితీసింది. ఇటు నక్సల్స్ వర్గాల నుంచే కాకుండా అటు మావోయిస్టుల మద్దతు కూడా దీదీ పొందగలిగారు. పలుసందర్భాల్లో మావోయిస్టులకు అనుకూలంగా దీదీ ప్రవర్తించడం దీనికి ముఖ్యకారణం. సింగూర్, నందిగ్రామ్ ల్లో ప్రజల తరపున గట్టిగా పోరాడిన దీదీకి మావోయిస్టులు అండగా నిలిచారు.

అదే స్పూర్తితో, అన్ని వర్గాల మద్దతుతో దీదీ నేడు అఖండఘనవిజయ౦ సాధించారు. వామపక్షపార్టీ ప్రజాగ్రహానికి గురయ్యి గల్లంతయింది. ఆఖరికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కూడా ఓడిపోయారు!

మరి శ్రామిక అరుణవర్ణం అస్తమించినట్లేనా? అంటే కానే కాదు. ఈ అరుణవర్ణం అనేది శ్రామికులకి సంబంధించినది, ఒక పార్టీకి కాదు. కేవలం  తాము మాత్రమే అరుణవర్ణ అధిపతులం అని పదవీ వ్యామోహంతో కొట్టుకున్న అరుణవర్ణపు వామపక్షపార్టీకి మాత్రమే అస్తమయం, అదీ ప్రస్తుతానికి!.

పశ్చిమాన అస్తమించిన అరుణుడు ఏవిధంగా ఆయితే శ్రామికవర్గానికి ఆనందాన్ని పంచడానికి మరుసటిరోజు ఉదయాన్నే ఉషస్సులతో ఉదయిస్తాడో అదే విధంగా నేడు అస్తమించిన వామపక్ష-అరుణవర్ణం రేపు దీదీ నుదుట అరుణవర్ణంగా ఉదయించి అసలైన వామపక్ష సిద్దాంతాలను పాటిస్తూ కర్షక, శ్రామిక లోకానికి చేయూతనిస్తుందని ఆశిద్దాం.


అదేవిధంగా మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి రోజున తమదైన విజ్ఞతను ప్రదర్శి౦చి ప్రపంచానికి తెలిపిన పశ్చిమబెంగాల్ ఓటర్లకి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.





Wednesday 4 May 2011

ఆ పాదాలకు వందనాలు!

మనసుని కాసేపు ఉల్లాసపరుద్దామని! 

గంగమ్మ ఉప్పొంగెనే! 


ఉత్తమ సంగీత సాహిత్యాల మేళవింపుగా గుభాళింపులు వెదజల్లే పాటల సౌరభాలు ఎన్నదగినవి ఎన్నింటినో తెలుగు చలనచిత్ర రంగానికి ఎందరో మహానుభావులు వన్నెతగ్గని వారసత్వంగా మనకు అందించారు. అయితే ఉత్తమ సంగీత సాహిత్యాలతో పాటు సాహిత్యానికి అనుగుణంగా నర్తించే నృత్య ప్రధానమైన పాటలు  బహుకొద్దిగా ఉంటాయి. అలాంటి పాటల్లోనూ నర్తకీమణి యొక్క అందమైన ముఖవర్చస్సు, లయలు, హొయలు, విరుపులు అగ్రతాంబూలాన్ని  అందుకుంటాయి.

అయితే శాస్త్రీయ నృత్యానికి ఆయువుపట్టు లాంటి “పాదం” యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ కేవలం పాదాల్ని మాత్రమే చూపిస్తూ సాగే పాటలు చాలా తక్కువ అని నా అభిప్రాయం. బహుశా ఇలాంటి పాటలు ప్రేక్షకులని అంతగా అలరించవని సదరు దర్శక నిర్మాతల అభిప్రాయం కాబోలు!.    

సరే ఉపోద్ఘాత౦ పక్కన బెట్టి అసలు విషయంలోకి వస్తా. ఉత్తమ సంగీత సాహిత్యాలతో పాటు అర్థవంతమైన నృత్య౦ ప్రధానంగా సాగి ముందు చెప్పినట్లు ఆయువుపట్టు లాంటి ఆ "పాదానికి" అగ్రతాంబూలాన్ని అందించిన ఒక పాటను  ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం.

“ఈ పాదం ఇలలోన నాట్య వేదం” అంటూ పాదానికి వందనాలు చెబుతూ సాగే ఈ పాట 1985లో విడుదలయ్యి తెలుగునాట స్ఫూర్తి నింపడంలో అఖండ ఘనవిజయాన్ని సాధించిన వాస్తవకధానిర్మిత “మయూరి”  చిత్రంలోనిది. ఇందులో కధానాయికగా నటించడమే కాక, తన వాస్తవ జీవితాన్ని ఆవిష్కరించి ఎందరికో స్పూర్తి ప్రధాత అయిన సుధాచంద్రన్ గారు “మయూరి” సుధాచంద్రన్ గా తెలుగువారికి చిరపరిచితమైన దివ్య సంవత్సరం. మరో విశేషం ఏమిటంటే, ఈ పాట చిత్రంలో భాగంగా కాకుండా చిత్ర ప్రారభంలో కనిపిస్తూ చిత్రం యొక్క  పరమార్ధాన్ని వివరిస్తూ తీసుకున్న నిర్ణయం కళాత్మక హృదయానికి తార్కాణంగా నిలవడం.  


ఉత్తమ సాహిత్యం, దానికి అనుగుణంగా నృత్యం, అందులోనే ఒదిగిన సంగీతపు సృష్టి వివరాలు:


చిత్రం           -  మయూరి
రాసిన వారు    -  శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు
పాడిన వారు    -  శ్రీపతి పండితారాధ్యుల (SP) శైలజ గారు
సంగీతం         -  శ్రీపతి పండితారాధ్యుల (SP) బాలసుబ్రహ్మణ్యం గారు
నర్తించిన వారు  - "మయూరి" సుధాచంద్రన్ గారు


లేలేత పదాల సాహిత్యం:

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం ||
ఈ పాదం


ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆనాటి బలికి అంతం
తనలోనే గంగమ్మ ఉప్పొంగగా
శిలలోనే ఆ గౌతమే పొంగగా
పాత పాటలో తను చరణమైన వేళా
కావ్యగీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసిన 
||ఈ పాదం


ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీ భక్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీ గంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పధమై
తుంబుర స్వర నారదా మునులు జనులు కొలిచిన 
||ఈ పాదం
 

తెలుగు దృశ్యసంగీత గొలుసు:(www.youtube.com/watch?v=_L8ScMJqm5s)


నృత్యంలో గమినించదగినవి, నన్ను మంత్రముగ్దుణ్ని చేసిన పాదముద్రలు :

౧) చిత్ర నిడివి 00:05 వద్ద “ఇల”ను చూపించే వైవిధ్యం

౨) చిత్ర నిడివి 00:44 నుండి 00:58 వరకు మిన్నాగుని, బలిని  మరియు గంగా ప్రవాహాన్ని ఆవిష్కరించే ఆద్భుతం.

౩) చిత్ర నిడివి 01:18 వద్ద లయలను, హోయలని చూపించడం

౪) చిత్ర నిడివి 01:57 వద్ద సప్తగిరి శిఖరాల అలవోక 

౫) ఇక పాట ఆద్యంతమూ అద్భుతమనిపించే  మయూర ఉల్లాసపు నడకలు, నటరాజ పాదపద్మాలు

ఇదే చిత్రాన్ని హిందీలో తీసారు “నాఛే మయూరి” అనే పేరుతో. అయితే ఇక్కడ పాటని S.జానకమ్మ గారు పాడారు.  పోలిక అని కాదు గానీ తెలుగులో ఈ పాటకి కావాల్సిన (మయూర) ఉల్లాసాన్ని పంచుతూ, పెంచుతూ శైలజ గారి గళపు జీర/మార్థవం మకరంద మత్తుని అందిస్తే జానకమ్మ గారి తియ్యదనపు గళం ఆ(పాట) ఉల్లాసాన్ని తగ్గించనట్లుంది :).  ఒకరకంగా శైలజగారి గళం వల్ల కూడా ఈ పాట అధ్బుతంగా వచ్చిందని నా భావన.


ఇంతటి అద్భుతమైన పాటని అందించిన ఆ మహానుభావులని పేరుపేరునా తలుచుకుంటూ వారి ::పాదాలకు వందనాలు::

హిందీ దృశ్యసంగీత గొలుసు:(http://www.youtube.com/watch?v=o6L-e_LvcWs)

మయూరి తెలుగు చలనచిత్రపు తొలిభాగపు గొలుసు:(http://www.youtube.com/watch?v=k-RBBR9wLYY)



బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers