నిజం..నిర్భయం

Sunday 24 April 2011

ఓ బాబా! నీవు నడిచి చూపిన దారిలో.. ఓ భక్తురాలి నివేదన

@సాక్షి 


ఓ సనాతనసారధి, సామాజికసేవకుని  నిర్యాణం..మహాభినిష్ర్కమణ.

ఉదయంలేవగానే ఓ విషాదవార్త.. ‘నా జీవితమే నా సందేశం’ అని ప్రపంచ మానవపశుపక్ష్యాదులకి శాంతిసందేశాన్ని అందించిన శ్రీ సత్యసాయిబాబా వారి నిర్యాణం..మహాభినిష్ర్కమణ. మా గతటపా చదివి మాతో అనుబంధం పెంచుకున్న వారి భక్తులు పంచుకున్న బాధాతృప్త హృదయా౦తరంగ౦ నుంచి వెలువడ్డ శతోధిక నివేదనా ఉత్తరాలతో నా ఉత్తరపెట్టె(ఇన్బాక్స్) నిండిపోయింది. వీటిలో అందరూ బాబాగారు తమకు పంచిన ప్రేమాభిమానాలు గురించిన ప్రస్తావనే తప్ప మేతావులు చెప్పే మాజిక్కులు-మాయలు లేకపోవడం గమనించదగినది. వారిలో కొందరు బాబాగారికి విన్నవించుకున్న నివేదన ఇక్కడ..



ఓ బాబా! నీవు నడిచి చూపిన దారిలో...

ప్రేమ, సేవా,కరుణా మార్గాలు పంచిన పూజ్యనీయమైన వ్యక్తిగా పపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హృదయాలలో కొలువై, తటస్తుల అభిమానాన్ని సైతం చూరగొన్న ఓ సత్యసాయి బాబా, నీ నిర్యాణం మానవలోకానికి తీరనిలోటు. బాబా, ఇక నీవు లేవు అన్న చేదు నిజాన్ని మా ఇంటిల్లిపాది జీర్ణించుకోలేకపోతున్నా౦. అయితే అదేసమయంలో నీ బోధనలు ఆచరించడమే నీకు సరైన నివాళిగా భావించే మేము నీవు భౌతికంగా మమ్ము వదిలివెళ్లినప్పటికీ నీవు పంచిచూపిన ప్రేమ, కరుణ, సేవా మార్గాలను మేము వదలకుండా ఆచరించినంతవరకు ఎల్లప్పుడూ మాతోనే ఉంటావన్నది వర్తమాన వాస్తవం. నీతివంత౦, అర్ధవంత౦, ప్రేమమయమైన జీవితాన్ని ఎలాగడపాలో మా కళ్ళముందు ఆచరించిచూపిన చూపిన మార్గదర్శకుడివి, మానవత్వం మూర్తీభవించిన మహానుభావుడివి. మమ్మల్నదరినీ ప్రేమ స్వరూపులుగా మీరు భావించడం, మేము తోటిమానవులని ఏవిధంగా ప్రేమించాలో చెప్పటానికి దార్శనికం. ప్రేమే దైవం-దైవమే ప్రేమ అని నీ ఆప్యాయతా ప్రవచనాలతో మాకు ఈ జీవిత పరమార్థాన్ని బోధించిన ప్రత్యక్ష దైవం నీవు. ఈ సందర్భంగా నీవు చెప్పిన సూర్తిమంతంపు ప్రేమైక ప్రవచనాలు..ఉద్బోదనలు కొన్ని..


౧. మానవపశుపక్ష్యాదులకి ప్రేమను పంచి, అవసరమైనవారికి సేవచేయడమే నీ జీవితపరమార్థం. 
౨. ప్రేమే దైవం- దైవమే ప్రేమ. ప్రేమలోనే జీవించు.
౩. నేను దేవుడిని, నువ్వు దేవుడివే. నాలో దైవత్వాన్ని గుర్తించాను నీలో దేవుణ్ని నీవు మేలుకోల్పలేకపోతున్నావు. 
౪. భగవంతుడు సుఖాలే అందిస్తుంటాడని, కష్టాలు మనం కొనితెచ్చుకున్నవి. 
౫. కష్టమనేది అనేది లేకుండా సుఖం రాదు. 
౬. దేహంలో సంచరించే జీవత్వమే దైవత్వం 
౭ .హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించడమే నిజమైన తపస్సు


ఆ విధమైన మృదుమధుర ఆధ్మాతిక బోధనలు, ప్రేమ సందేశాలు, శాంతి వచనాలతో ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన నీవు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటావు. కేవలం ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాక,  ఆర్త, దీనజనోద్దరణకు శ్రీకారం చుట్టి సమత, మమత, మానవత పంచి అవే సమత-మమత-మానవతా భావనలను మాలో పెంచిన మహానీయుడవు.

ఓ బాబా... నీవు చూపిన దారిలో మేమూ నడుస్తున్నాం. ఈ నడక నీవులేవని ఆపము. నీవు మాకు పంచిన ప్రేమను, జీవితపు ప్రశాంతతని తోటిమానవులకి పంచడానికి మరింత కృతనిశ్చయంతో ఉద్యుక్తులమవుతున్నాము. మమ్ము నీ ప్రేమ,శాంతి వచనాలతో ఆశీర్వదించు.

శ్రీమతి లక్ష్మి లాభాని పతివాడ గారు, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, అమెరికా.

-----------------------------------------------------------------

ఓ బాబా, నేను నీ భక్తుడిని కాకపోయినా నీవు చూపిన ప్రేమమార్గంలో నడిచేవారిలో ఒకడిని. అసంఖ్యాక విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా సత్యం, ప్రేమ, కరుణలను సుమారు ఐదు దశాబ్దలపాటు మీరు ప్రజల సేవకు అంకితమైన మీ నిర్యాణం కడు బాధాకరం. మంచిచేసిన వారినీ తప్పుపడుతూ జీవించే మాలాంటి తుచ్చమైన మానవుల కోసం సర్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తివి నీవు. ప్రేమే దైవం-దైవమే ప్రేమ అంటూ నీవు చూపిన మార్గ౦ నభూతో నభవిష్యతి. గుక్కెడు నీటికోసం అలమటించే మా కరవుసీమ దాహార్తిని తీర్చి అపరభగీరధుడవయ్యావు. మానవసేవే మాధవసేవ అన్న దైవసూత్రాన్ని ఇలలో మా కళ్ళముందు త్రికరణసూత్రంగా ఆచరించి చూపిన మహానుభావుడివి నీవు. నీవు చూపించిన సామాజికసేవలోనే ఇకనూ నడుస్తానని చెపుతూ.....!

శ్రీ రాజీవ్ రెడ్డి గారు, హైదరాబాదు.

సాయి మాట!

Thursday 21 April 2011

సాయంసంధ్యా సమయమిది..సాయం చేయగ కదలండీ! - 1



సాయంసంధ్యా సమయం! ఎంత అధ్బుతమైన పదం. తనవారికి, పరులకి సాయంచేసే సంతోషాన్ని పంచుకునే సంధ్యాసమయమని అనిపించట్లేదూ?దాని అర్థం ఇది కాదయ్యా అంటారా? అయితే చదవండి మరి:)


ఉదయసంధ్య హడావుడితో, ఉరుకులపరుగులతో మానవపశుపక్ష్యాదులుకి తీరిక ఉండదు, ఎవరి వృత్తులకి వారు వెళ్ళే సమయమది.

అదే సాయంసంధ్యా సమయమో:
పగలంతా కష్టపడి పొలంపనుల నుండి సాయంకాలానికి ఇల్లు జేరిన  రైతన్నలు తమ పొలంలో తొలిగా పండి౦చిన లేలేత సజ్జ/రాగి/జొన్న కంకులను ఇతరులకి  పంచే సమయం.  గొర్రెలు/మేకలు కాయడానికి కొండకేసివెళ్ళిన గొల్లలు ఆ కొండలలో ఆ ఋతువులలో దొరికే ప౦డ్లు(రేగి/కలే/జువ్వి) తమ పిల్లలికి, వారి దోస్తులకి పంచే సమయం.ఉదయమనంగా వెళ్ళిన పక్షులు కిలకిలారావాలతో తమతమ గూళ్ళకి చేరి తాము తెచ్చిన ఆహారాన్ని, ఆశగా ఎదురుచూస్తున్న పిల్లలకి ముద్దుగా తినిపించే సమయం. ఆవులు ఆబగా ఇంటికి చేరి, అంబా అంటూ ఆవురావురుమని ఎదురుచూస్తున్న లేగదూడని ముద్దుగానిమిరి పాలిచ్చేసమయం. బడి ఎగ్గొట్టి మరీ కొండలకేసిబోయిన పిల్లలు రేగిపండ్లు/చింతపువ్వు/చింతకాయలు తీసుకువచ్చి ఒక్కరే తినకుండా తమ దోస్తులని పిలిచి పంచుకుని మరీ తినే సమయం. వీధికి  ఆ కొనాకు ఉన్న లచ్చుమమ్మ ఏం ఎల్లమ్మా పిల్లాడు ఎందుకేడుస్తాన్నాడు అంటే ఈ కొనాకు  ఉన్న ఎల్లమ్మ ఇప్పుడే పొలంనుంచి వచ్చానక్కా...చిన్నోడేమో ముక్కలేనిదే ముద్ద దిగదని ఏడుస్తున్నాడని చెబితే, ఉందా/పెట్టమని ఎల్లమ్మ అడక్కుండానే .. ఓ అదా విషయం ఈరోజు మా ఇంట్లో ముక్కలేలే, ఇదిగో మా పిల్లోడికిచ్చి  ఇప్పుడే పంపిస్తున్నా అని లచ్చుమమ్మ తనకున్నదాన్ని ఇతరులకి పంచుకునే సమయం. ఆ రెండు కొనాకుల మధ్య ఇంట్లో ఉన్న నేను అమరికలు లేని ఆ ఆప్యాయతపు మాటలను వింటూ ఆనందించే సమయం. ప్రేమ, ఆప్యాయతలు ఎలా పంచిపుచ్చుకోవాలి అన్నది పెద్దలనుంచి గమనించి పిల్లలు నేర్చుకునే సమయం.


ఇక మా ఇంటికి వస్తే ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు పనిచేసి కాసేపలా నడుమువాల్చి, పక్షుల కిలకిలారావాలతో నిద్ర లేచి గృహలక్ష్మిలా తయారయ్యి తన కుటుంబం కోసం మా మాతృమూర్తి మళ్ళీ శ్రమించే సమయం. ఊరికి దూరాభారంగా ఆరేడు మైళ్ళ దూరంలో ఉన్న బడికి నడుచుకుంటూ/సైకిల్ తొక్కుంటూ వెళ్లి, చదువు చెప్పి తిరిగి వస్తూ పిల్లలికి తన బడలిక తెలీకుండా ఆనందాన్ని మొహ౦మీద, తాయిలాలను చేతిలోనూ పెట్టుకు వచ్చిన నాన్నగారు వాటిని పిల్లలకిచ్చి వారితో ఆనందాన్ని, ఆప్యాయతని పంచుకుని పెంచుకునే సమయం. అప్పుడే బడి నుంచి వచ్చిన అక్కలు/అన్నలు తాము కొనుక్కున్నదానిలో కొద్దిగా దాచిఉంచి చిన్నతమ్ముడినైన నన్ను గారంగా ఆటపట్టిస్తూ తినిపించే సమయం.

మొత్తమ్మీద ఇదో శ్రామిక సౌందర్యం.అయితే ఈ శ్రామిక సౌందర్యం కేవలం కష్టపడ్డంతోనే ఆగిపోలేదు. తాము కష్టపడి సంపాందించినది లేదా ఉన్నది  తనవారికి/తోటివారికి పంచుకోవడంలోనూ ఈ శ్రామికసౌందర్యం అంతర్లీనంగా వ్యాపించిఉన్నది. వెరసి శ్రామిక సౌందర్యపు పుట్టింటి నుంచి సారెగా వచ్చిన "సాయ" చీరను కట్టుకుని సంధ్యాదేవి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ తన ఆనందాన్ని సప్తవర్ణాల అంచుతో ప్రపంచానికి ప్రకటించే సమయమది.

ఇవన్నీ ఒక ఎత్తయితే తన సొంతలాభ౦ ఎంతమాత్రం లేకు౦డా పగలంతా వెలుగునిస్తూ వారి కష్టసుఖాలను కళ్లారాచూస్తూ బాధను పంచుకుంటున్న సూరి మామ ఇక తానూ విశ్రమించే వేళయిందని పున్నమి వెలుగుల చల్లదనాన్ని పంచమని చందమామని రారమ్మని పిలిచే సమయం.

సాయంసంధ్యలో అంత సాయపు మహత్తు ఉంది మరి!. ఆ విధంగా తనవారికీ, ఇతరులకీ సాయం చేసి ఆనందం పొందడం అనేది భారతీయ జీవనవ్యవస్థలో తనదైన రూపులో మిళితమై ఉందని కొత్తగా తనకి సాయసూత్రాలు ప్రత్యేకించి చెప్పనవసరంలేదని గట్టిగా చెబుతుంది.      

ఆయితే పైన చెప్పిందంతా గతించినకాలపు గుర్తులు అని అందరూ ఒప్పుకుంటారు. నిజమే.. ఆ అభిమానాలు, ఆప్యాయతలు(అ.ఆ) చాలావరకు గతించాయి. సాయం సన్నగిల్లింది.  ఇచ్చిపుచ్చుకునే  వ్యవహారం కేవలం  వ్యాపారధోరణిగా, అవసరమయినప్పుడు మాత్రమే పుట్టుకువచ్చే అభిమానాలు..ప్రేమలో కొత్తపుంతలు.

మరిప్పుడు ఏవిట్టా అని అడుగుతారా? చెబుతా..ఈ టపాకి అనుబంధ టపాలో వివరిస్తా .. "అలాంటి" సాయంసంధ్యాసమయాన్ని ఇతరులకి మనం పంచడానికి ఆసన్నమైన అవసరాన్ని గురించి :).

మరి  సాయం చేయగ కదులుతారా?

Monday 18 April 2011

శ్రీ క.చ.రా(కె.సి.ఆర్) గారి మాటలను అర్థం చేసుకొనవలిసిన విధంబెట్టిదనిన..

సామ్రాజ్యవాదుల కంబంధహస్తాల నుంచి సామాన్యుల తెలంగాణ విముక్తి కోసం పోరాడుతున్న నాయకుడిగా చెప్పబడుతున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు(క.చ.రా) గారి మాటలకి ఉత్తరాంధ్ర బ్రాహ్మణులు ఆగ్రహిస్తూ వీధినపడ్డ వైనం చూసి కలిగిన బాధాభిప్రాయమిది.



"ఆంధ్రా బ్రాహ్మణులు అలంకారప్రియులు" అన్న క.చ.రా గారి మాటలని పట్టుకుని సామ్రాజ్యవాదులు తాపీగా ఆ మాటలో ఆపాదించిన చెందిన సామాజికవర్గాన్ని ఎగదోయడం మొదలుపెట్టారు. ఇక వీరి కనుసన్నల్లో ఉండే ప్రచారమిధ్యమాలు కొత్తగా బ్రాహ్మణులకి ఏదో అవమానం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నాయు. సరే దొరక్కదొరక్క దొరికిన మాదాకవళ౦లో చివరివరకు గీక్కోవడంలో ఎవరివంతు వారిది. మరి నా వంతుగా ఈ టపా :). క.చ.రా గారి అసలు ఉద్దేశ్య౦ గురించిన రంధ్రాన్వేషణ పక్కన బెట్టిన, ప్రస్తుత పరిస్థితులకి తగ్గట్లు అర్థం చేసుకోనవలిసిన వాస్తవమేమనగా...

సమస్యలు/బాధలు వీధికెక్కి గగ్గోలు పెడితేగానీ పట్టించుకుని, పరిష్కారమార్గం చూపని కబోది ప్రభుత్వం మనది. అలాగే పక్కోడి సమస్య తన సమస్య అయ్యేవరకు గానీ స్పందించని అపురూప ప్రజానీక౦. మొత్తమ్మీద గోప్ప పెజాస్వామ్య దేశ౦. అంటే ఎవడి సమస్యను వాడే తనలాంటి సమస్యను అనుభవిస్తున్న లేదా దానికి అనుబంధ౦గా ఉన్నవారితో కలిసి రెడ్దేక్కి మరీ పరిష్కరించుకోవాలి అన్న సామాన్య సూత్రాన్ని బల్లగుద్ది మరీ నొక్కివక్కాణిస్తున్న కాలమిది. కర్మ సిద్దాంతం చెప్పిందీ అదే...అర్జునిడిని యుద్ధభూమిలో పోరాడమని!    

పైన చెప్పిన విధంగా చూస్తే నేను గత ఆరేళ్ళుగా భాగ్యనగర౦(హైదరాబాదు)లో ఉన్నప్పుడు పత్రికల ద్వారా పలుమార్లు గమని౦చినది: "తెల౦గాణా ఆర్చక బ్రాహ్మణులు తమకు సమస్య వచ్చినప్పుడల్లా వీధికెక్కి కబోది ప్రభుత్వానికి తమ సమస్యను తెలియజేయడం, తద్వారా కష్టపడి పరిష్కారం మార్గం సాధించుకోవడం".వీరు చేసిన పోరాటాల్ల్లో "అర్చకుల కనీస జీవనభృతి, కనీసం దీపధూపాలకు కూడా నోచుకోని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, తెలుగు చలనచిత్రాలలో తమపై ఉన్న అసహ్య,అసభ్యకరమైన దృశ్యాలు తొలగించండ౦ లాంటివి" ఎన్నతగినవి.

మరి అన్నీ పరిష్కార౦ అయ్యాయా అంటే కాదనే చెప్పాలి. కారణం, ప్రభుత్వాన్ని సత్వరమే స్పంది౦చేట్లుగా కదిలించే సామాజిక బలం లేకపోవడమే. ఆ "సామాజిక బలం" కోసం అయ్యా..రండి పోరాడుదాం అంటే .. ఆయ్ ..టాట్.. ఇదేదో కులసమస్య.. ఆదర్శవాదినైన నన్ను కులపోడిగా ముద్రవేస్తారు అనే రకాలు ఎక్కువ. మరి సమస్య ఉన్న కులంవాడే కాదుపో అన్నప్పుడు  పక్క కులపోడు(రెడ్డిగార్లు మినహా!) వచ్చి సాయం చేస్తాడా? సరే ఇది వేరే విషయ౦. మరోసారి చర్చించుకోవచ్చు. మరికొందరు ఇదే ఆదర్శ౦లో, ఇల్లు కాలింది జంగమయ్యా అంటే, నాజోలె  నాదగ్గరే ఉన్నాయిలే అన్నరీతిలో, ఇంకా ముందుకు పొయ్యి ఇంకా కులమేంటి, అందరం హిందువులం అన్న నాచు వాక్యాలు దొరికినదే తడవు అన్నట్లు వాస్తవానికి తల౦టి మరీ వల్లెవేస్తారు. నిజమే అందరం హిందువులమే, కులంవద్దు.. ఒప్పుకుంటా!. కానీ వాస్తవమలా లేదే. పైన చెప్పిన సమస్యలు ఒక కులసమస్యగానే సామాన్యప్రజానికం అనుకుంటుంది. మరి ఆ సమస్యలపై ఎవరు పోరాడాలి? స.ధా ఉందా మీ ఆదర్శవాదంలో అంటే...బెబ్బే..? అంతేకాక ఇక్కడేమీ పక్క కులపోడిని తోక్కడానికో లేక వాడి ఆస్తులని ఆక్రమి౦చుకోవడానికో కాదు కదా పోరాడేది.. మరి గాడిదకు గడ్డివేసి ఆవును పాలివ్వమన్నట్లు౦డే ఈ  అలివిమాలిన ఆదర్శానికి హేతువేంటి?    

పైన చెప్పిన రకాలలో మంచి ఉదాహరణ శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు. దాదాపు అయిదారేళ్ళ క్రిందట ఆంధ్రా బ్రాహ్మణ సంఘం వారు ఒక సభకి ఆహ్వానితులుగా తనపేరుని ప్రకటిస్తే, ఒక కులసభకి ఆహ్వానితుడిగా తనపేరు ప్రకటించడం తగదని తెగ హైరానా చేసి దాన్ని ఖండిస్తూ పత్రికాముఖంగా బహిరంగప్రకటన కూడా ఇచ్చారు. బావుంది. ఆనక ఏడాదీ/రెండేళ్ళకి మా.నా గారు అమెరికాలో కేవలం ఆరోపణ ఎదుర్కొడం, "అ౦దులో ఎంత నిజమో అబద్దమో తెలీ/తేలకుండానే ఇక్కడి ప్రచారమిధ్యమాలు, మహిళామండళ్ళు "శర్మా ఇదేం  ఖర్మ" అంటూ వీధికెక్కి పెట్టిన గగ్గోలు - అదే సమయలో ఒక నటుడు తన ఇంట్లోనే హత్యాయత్నం చేసి తీరిగ్గా రాజమార్గం ద్వారా తప్పించుకున్న బహిరంగరహస్యం మీద చూపిన శీతకన్నుని" స్వయంగా చూసి అనుభవించిన మా.నా గారికి అవి చాలవన్నట్లు శోభారాజు నాయుడుగారి భూఆక్రమణ ఆరోపణలు. అంతులేని ఐశ్వర్య౦, అంతకు మించి పేరుప్రఖ్యాతులు ఉన్న పెద్దాయన రెండేరెండు గంటల్లో రుజువుకాని ఆరోపణలతో తనని రోడ్డుకీడ్చిన వైనంచూసి.. మరి తెలుసుండాలి సామాజిక బలమంటే! ఇక్కడ మా.నా గారిని ఏమీ అనకుడదని నేను చెప్పడంలేదు..కానీ రుజువులేకుండానే ఇంతగా గగ్గోలు పెట్టిన మాదాకవళాలు రుజువులుండి సామాజిక బలుపు మీద తప్పించుకున్నదానిమీద పెట్టలేదే౦ ఆ చావుగగ్గోలు? ఇక్కడ ఏ బలం వాటి నోరు నొక్కింది?                          


అసలు విషయానికి వస్తే, సమస్యలను నడినెత్తిపై పెట్టుకుని కర్మసిద్దంతాన్ని చంకలో పెట్టుకుని చేతకానితనాన్ని ఆదర్శవాదంగా పైకి చెప్పుకుటూ తన తోటివారి సమస్యలకు స్పందించనివారు మరి అలంకారప్రియులే.. అంటే "వాస్తవాలను మరిచి అడంబరాలకు ప్రాధాన్యత...వీరు ఉన్నా లేనట్లే"! ఈ లెక్కన చూస్తే సదరు శ్రీ క.చ.రా గారు అన్నదాంట్లో తప్పులేదు.


అందుకని ఆంధ్రాబ్రాహ్మణ అయ్యలూ,
మొదలు నరికినచెట్టులా ఉపకులం, ఉపతెగ, శాఖ, గోత్రం తదితరాలతో ఊరికొకరు, పుట్టకొకరు ఉన్న మనకు మళ్ళీ ఈ ప్రాంతాలగొడవలతో మరింతగా విడిపోవడం వెన్నతో పెట్టిన విద్య. కానీ మీ ముందుతరాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కొద్దిగా ఆలోచించి సంఘటితంగా అసలు సమస్యలపై పోరాడమని మనవి. సదరు క.చ.రా గారు అన్నమాటలకి బాధ కలిగితే ఆ ప్రాంతపు బ్రాహ్మణపెద్దలతో మాట్లాడి వారిచేత క.చ.రా ని గట్టిగా అడిగించండి. అంతే కానీ ఎంతయ్యా ఇవ్వాళ బేరంలో లాభంమంటే, ఎఱిగినవాడు వెఱ్ఱివాడు రాలేదన్నాడన్నట్లుండే సామ్రాజ్యవాదుల ఉచ్చులో అసలేపడవద్దని, పడి వీధికెక్కద్దని సాష్టాంగనమస్కారం చేసి మరీ వేడుకుంటున్నా!!! ఎందుకంటే వీధినపడి పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యలు మన మెడచుట్టూ చాలా ఉన్నాయి మరి!

Wednesday 6 April 2011

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన!







కోట్లమంది ప్రజల ఆరాధ్యదైవమైన శ్రీ సత్యసాయిబాబాగారికి ఆరోగ్యం బాలేదని వారి భక్తుల కన్నా ఎక్కువగా వాపోతూ ఓ౦డ్రపెడుతున్న మేతావి గాడిదలు!


అదేదో సైన్మాలో "దేశ౦లో దొంగలుపడ్డారు" అన్నట్లు దేశంలోని మేతావులంతా బాబా(ల) మీద పడ్డారు, దేశాన్ని బాగుచేయడానికి! నమ్మేవాడు నాపరాయి ఆయితే నమ్మనోడు నాచుకట్టే! వీటిమీద వాదించుకుంటూ కూర్చోవడానికి మనదేమైనా అభివృద్ధి చెందిన దేశమా... కాదే .. అసలే గత యాబైఏళ్ళ పైబడి అభివృద్ధి చెందుతూతూతూతూతూన్న దేశం! పోనీ బాబాలేమైనా దేశాన్ని దోచుకుతి౦టూ నల్లధన౦ బా౦కుల్లో మూటలు గడుతున్నారా?  మరెందుకో ఈ ఏడుపు? నాస్తిక అస్తిత్వాన్ని, స్వయంప్రకటిత మేతావితనాన్ని కాపాడుకోవడానికి, స్వయంగా పోరాడలేని చేతకానితనాన్ని కప్పెట్టదానికేగా!  


రండి తంబీలు... పేదవారినొదేలిసి తీరిగ్గా బాబాల రోగాలపైబడి మన అస్తిత్వాన్ని నిలుపుకుందాం రా!.




సగటు మనిషి: బాబా అనారోగ్యంతో ఉన్నట్లు విని కలత చెంది సాటి మనిషిగా వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మా ఇంటిల్లిపాది ఈ వార్తతో కన్నీటి పర్యంతమైంది.


హేటువాది: మీ బాబాయే దేవుడు కదా, మరలాంటప్పుడు రోగాలు, రొప్పులు ఏంటి? దానికి మీరు కలతచెందడమేమిటి. మీరు నిజంగా గోర్రేలే.. ఎప్పుడు బాగుపడతారో ఏమో!


స.మ: అదేంటి హేటువాది, సాటి మనిషి-అనారోగ్యం అన్న విచక్షణాజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్న నువ్వసలు మనిషివేనా?


వాస్తవవాది: అవును గాడిదల కన్నా గొర్రెలు నయం, తమ పని తాము చేసుకుంటూపోతాయి. హేటువాది చెప్పినట్లు దేవుడికి రోగాలేంటి అన్నచందాన చూసినా మానవశరీరంలో ఉన్న దేవుడు కూడా కష్టాలు పడకతప్పదని అన్ని మతాలూ చెబుతున్నాయి. మన రామయ్య, సీతమ్మ పడ్డ బాధలు పగవాడికి కూడా వద్దని చెప్పుకుంటూ ఉంటాము. అనారోగ్యంతో బాబాగారు అసుపత్రి పాలైతే అనాలోచితంగా మాట్లాడ్డం ఈ హేటువాదుల భావదారిద్ర్యపుదాస్యం , అవగాహనారాహిత్య పైత్యాన్ని సూచిస్తుంది.


దారిన పోయే దానయ్య: మా బాగా చెప్పారు వాస్తవవాది గారు!            


హే.వా: లౌకికరాజ్యమైన మనదేశంలో బాబాకి బాగులేదని ప్రభుత్వవైద్యుల్ని పంపడమేమిటి? నే ఖండిస్తున్నా


స.మ: అసలు లౌకికరాజ్యమంటే ఏంది హే.వా?


వా.వా: ఆయన చేసిన మంచిపనులు, ప్రజల్లో ఉన్న అభిమానం చూసి తప్పనిసరై ప్రభుత్వం స్పంది౦చింది. పోనీ హే.వా చెప్పినట్లు తీసుకున్నా ఇంతకుముందు ఏ బాబాకి ప్రభుత్వ సహాయం అందించి౦ది? వారికి రోగాలు రాలేదా? అయినా బాబాకి వీరి అవసరమేమీ లేదు. అక్కడ బాబాగారు కట్టించిన అత్యాధునిక వైద్యశాల, అలానే ఆయన భక్తులైన ఎంతోమంది ప్రముఖ వైద్యులు ఆయనకు వైద్యం చేయడానికి సిద్దంగా ఉన్నారు. కాశ్మీరు వాసియై భారతీయ వైద్యశాల(ఎయిమ్స్) అధ్యక్షుడిగా పనిచేస్తూ కేవలం బాబా సన్నిధిలో లభించే ప్రశాంతత కోసం అంతటి అత్యున్నత ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి  వచ్చిన శ్రీ సఫాయి గారు బాబాగారిని కంటికి రెప్పలా చూసుకోగల వాళ్ళలో ఒకరు. హే.వా లకి వీరందరూ గొర్రెలే!


వా.వా: భలే ప్రశ్న అడిగావు! హే.వా ల దృష్టిలో లౌకికరాజ్యమంటే మతాలను ద్వేషిస్తూ, అందులోనూ హై౦దవధర్మ్మాన్ని, దాని ఆచారాలను, సంబంధిత గురువులను హేళన చేస్తూ పబ్బం గడుపుకోవడం అన్న మాట!


దా.దా: మా బాగా చెప్పారు లౌకికరాజ్యమంటే!      


హే.వా: అయ్.. మీ బాబా మహిమల చాటు కోట్లు దోచాడు.. ఎంతో మందిని మోసం చేశాడు. అలాంటి వాడినా మీరు వేనుకేస్కోచ్చేది? చెప్పాకదా మీరు గొర్రెలు... నేను మేతావిని.


స.మ. అవునా హే.వా, నాకు తెలీదే!. నేనెప్పుడూ ఆయన చేసిన మంచిపనులు చూసాగాని వీటి గురించి అలోచి౦చలేదే. మరి ఆ దోచుకున్న వాటి ఆధారాలు బయటపెట్టి చెరసాలలో పెట్టించలేకపోయావా?


దా.దా: ఈ ఆరోపణలు ఎవరి మీద లేవు, పక్కోడు కొద్దిగా బాగుపడి పేరు తెచ్చుకున్నాడంటే చాలు!. ఆయనదాకా ఎందుకు, నేను నా కాయకష్టం మీద మొన్న నాలుగెకరాల పొల౦ కొనుక్కు౦టేనే ఊళ్లో అందరూ చెవులు కొరుక్కున్నారు. అదేదో నేను పక్కోడి పొలాన్ని కబ్జా చేసో లేక మోసం చేసో రాయించుకున్నా అని.


వా.వా: ఆరోపణలు ఉన్నా లేకపోతే కల్పించిమరీ బురదజల్లడానికే హే.వా ఉంది, వారు మంచి చూడలేని కబోదులు. వీరు చేసే అసత్యఆరోపణలకి రుజువులు ఉండవు, భావదాస్యం తప్ప. అందుకే ఈ ఓ౦డ్రలు. బాబాగారు సాక్షాత్తు భగవంతుడే అన్నదాన్ని పక్కనబెట్టినా, ఆయన గొప్ప మానవతావాదిగా, సమాజ సేవకుడిగా ప్రజలందరూ గుర్తించారు. ఆయన చేసిన మంచి పనుల్లో కొన్ని..


౧.బృహత్తర తాగునీటి పథకాన్ని చేపట్టి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చారు 
౨.విద్య, వైద్య రంగాల్లో ఉత్తమ సేవలందించారు. నిరుపేదలకు అన్ని సేవలు ఉచితం 
౪.ఉన్నత విద్య కోసం డీమ్డ్ యూనివర్సిటీ   
౩.తెలుగుగంగ నీటిని చెన్నైకి సరఫరా చేసేందుకు ఏంతో కృషిచేసి ప్రజల దాహార్తిని తీర్చారు.    
౪.అనేక మతాలు, కులాలు ఒకటే అన్న నినాదంతో ప్రపంచామానవాళికి శాంతిసందేశాన్ని ఇవ్వడ౦లో ఇతోధికంగా కృషి చేసారు.   
౫.ప్రశాంతతను కోల్పోయిన ఏంతోమందికి తన శాంతివచనాలతో స్వస్థత చేకూర్చి జీవితంపై మళ్ళీ ఆశని జిగురింపజేశాడు.


స.మ. అవును నిజమే వా.వా. మా కుటుంబం ఇలా సుఖంగా ఉందంటే ఆయన చలవే కదా!


హే.వా. అక్కడే అగు వా.వా, ఎవడిడబ్బయ్యా అది? ఆయనేమన్నా సంపాదించి ఖర్చుపెట్టాడా ఏంటి? అంతా భక్తుల సొమ్మే కదా!


వా.వా: అది నీజేబీబిలో సోమ్మా, నా జేబీలోదా అనేది వాజమ్మ ప్రశ్న! గాంధీగారు ఉద్యమాలు చేసినప్పుడు అవసరమైన ధనసహాయం అందరూ చేసారు. అక్కడ ఉద్యమంలో గాంధీగారి నిజాయితీని ప్రస్నిస్తామా! "ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు" అన్నట్లు అందరినీ కట్టేసే శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నవాడు నలుగురినీ సమీకరించి ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు ఎవరి సోమ్మైతే ఏంటి? మీ సొమ్ములు నాకిస్తే నేను నా పిల్లలకి ఇస్తా గానీ నలుగురికీ ఖర్చుపెడతానా ఏంటి? కొద్దిగా వాస్తవ౦లో ఆలోచించు.. మరీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా!


దా.దా: మంచిగా అడిగావు వా.వా! ఏం హే.వా? నీకు సోమ్ములిస్తే నువ్వూ అంతే నిజాయితీగా ఖర్చు పెడతావా?    


రంధ్రాన్వేషి: ఈ వా.వా అన్నీ అబద్దాలే చెపుతున్నాడు.. నిజాలు నే మాత్రమే జెప్పాల! ఏది రంద్రం?


దా.దా: మధ్యలో ఈ కేతిగాడ్ని ఎవరు రానిచ్చారు? ఆ షిట్లాండులో రంధ్రాలు తవ్వే పనికి పంపించండి బాబు!


స.మ. దా.దా నువ్వరుకో! వాడో బోకియాలే, వదిలే!.


హే.వా: ఇవన్నీ కాదు, మీ బాబా మూఢనమ్మకాలని ప్రోత్సహించుతున్నాడు.. బూడిద చేతుల్లోంచి, గుండెల్లోంచి శివలింగాలు.. ఏంటిది? గొర్రెల్ని చేయడం కాపోతే?


స.మ: హే.వా.. నువ్వు గొర్రెవు కావు, గాడిదవని ముందే విన్నవి౦చుకున్నాం కదా.. కొద్దిగా ఆ గొర్రె ఓ౦డ్ర ఆపు!


వా.వా: మీరు అంతా పాపులు, మీకు కళ్లిస్తాం, కాళ్లిస్తాం అని మరీ ఘోరంగా ప్రజల్ని మోసగించే శ్వేత దేవదూతలు, భూతాల్ని వదిలిస్తా౦ రండి అని గగ్గోలు పెట్టే ఆకుపచ్చ ముల్లాలు ఈ హే.వా లకి కనబడరు. కనబడినా మొహంమీద ఊమ్మూస్తే తుడుచుకున్నోడికి మల్లే చూసీ చూడనట్లు పోతారు. ప్రాణభయం మరి. మూడనమ్మక౦ ఎక్కడైనా మూఢనమ్మకమే!ఈ వాస్తవాల్ని పక్కనబెడితే యెనకటికి యెవరో చెప్పినట్లు "గుమ్మ౦ వెనుక గుమ్మడి కాయలు పోయినా పర్లేదు గాని ముందట మునక్కాయలు పొతే మటుకు ఏడిచాట్ట!" అన్నట్లు, మరి ఉన్నవాడి నుంచి లేనివాడి దాకా ప్రభావితం చేస్తూ సమూలంగా నాశనం చేసే నవీన మూడనమ్మకాల మాటేమిటి?  


౧.కోకాకోలా తదితర పానీయాలు తాగితే రోగాలు..దాని మాటున కోట్ల రూపాయల వ్యాపారం...! మన నీరు తవ్వుకొని మనకే అమ్మడం!.
౨.మరో పక్క ఆటల మాటు వేలకోట్ల జూదవ్యాపారం.. పల్లెటూల్లక్కి తాగిన సెగలు : సచిన్ వంద పరుగులు చేయలేదని మైసూరుకు చెందిన ఇరవైఏళ్ళ కుర్రాడు ఆత్మహత్య!   
౩.ఇవన్నీ చాలవన్నట్టు దినాల పేరుతో లక్షలకోట్లు బురదపాలు.. 
౪.పెట్టుబడిదారులు వినియోగదారులని నిలువుదోపిడీ చేసి మరీ కబోదుల్ని చేసే వ్యాపారాలు, సంబందిత కుంభకోణాలు.  
౫.చైనా నుంచి అపారంగా దిగుమతి అవుతున్న ఎందుకూ పనికిరాని వస్తువులు. వాటిని వాడిన/తిన్న పిల్లల శక్తిని నిర్వీర్యం చేసి చావుకు దగ్గర చేసేవి. 
౬.ఇంకా................
                           
పైవన్నీ మన కళ్ళముందు జరుగుతున్నవి..నవీన మూడనమ్మకాల్లో కొన్ని మాత్రమే!.. అందరినీ సమూలంగా ప్రభావితం చేస్తున్నవి. నోరుతెరుచుని ఏమీ చేయలేని స్థితిలో వాటిలో భాగమైన మనం సమాజంలో ఏదో మూల తనను దేవుడిగా కోలుచుకునేవాళ్ళు కొద్దిమంది ఉండి... వారిని ప్రభావితం చేస్తూ వారినే దోచుకుంటుంటే(మీ పిచ్చిలెక్క ప్రకారం!) నష్టం ఏమిటి? నాస్తిక అస్తిత్వాన్ని, స్వయంప్రకటిత మేతావితనాన్ని కాపాడుకోవడానికి కాకపోతే!


స.మ: మంచిగా చెప్పారు.


వితండవాది: సామాన్యుడికి అనారోగ్యం వస్తే ప్రభుత్వం ఇ౦త హడావుడి చేస్తు౦దా?


దా.దా: వి.వా, నీ విధవవితండం బావుంది. ప్రభుత్వపు హడావుడి ఓట్ల కోసమని తెలీదూ! అది పక్కనబెడితే రేపు నేను అనారోగ్యం పాలైతే మీ అమ్మ లేదా మీ ఇంటిల్లిపాదిని చూసుకున్నట్టుగా నన్ను చూసుకుంటవా? లేక ఆ బాధ్యత ప్రభుత్వానిది నీ బాధ్యత వితండ వాగుడ౦టావా?  


వా.వా: ముందుగా బాబా గారు ఒక సామూహిక శక్తి, సామాన్యుడు కాదు. నేడు ఆయన భక్తులు ఎన్నో ప్రజాఉపయోగకరమైన పనులు ఆయన మాటమాత్రం మీద చేస్తున్నారు. బాబాగారి మాట వారికి వేదం. బాబావారి అనారోగ్యం వార్తవిని తల్లడిల్లుతున్న వారి భక్తులలో కొందరు:


బాబా త్వరగా కోలుకోవాలి
సత్యసాయి బాబా త్వరగా కోలుకోవాలి. ఆయన సందేశం వినాలని ఉంది. నేను ఇక్కడికి రాకముందు ఎన్నో సమస్యలతో ఉండేదాన్ని. బాబాను దర్శించుకోవడానికి 1999 నుంచి వస్తున్నాను. అప్పటి నుంచి సమస్యలు వాటంతటవే తొలిగిపోయాయి. ప్రశాంతతను కోల్పోయిన వారికి పుట్టపర్తిలో ప్రశాంతత దొరుకుతుంది. బాబా త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నాను. - కార్లి, ఆస్ట్రేలియా


నిజంగా ఆయన దేవుడే
సత్యసాయి నిజంగా దేవుడేనని చె ప్పవచ్చు. బాబాపై మొదట్లో ఎన్నో విమర్శలు చేశారు. కానీ బాబా సేవాభావం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. బాబాను దర్శించుకున్నప్పుడల్లా తల్లిదండ్రులను పూజించాలని చెప్పేవారు. నిజంగా తల్లిద౦డ్రులు ప్రత్యక్ష దైవంతో సమానమని బాబా మాటలు విన్నాక తెలిసింది. భారతీయ సంస్కృతి నాకెంతో నచ్చింది.
- ఇన్‌ఘర్, జర్మనీ


బాబా సేవలోనే ఉండిపోతా
నేను కాంట్రాక్టర్. బాబా సందేశం నాకెంతగానో నచ్చింది. అందుకే సేవా ఆర్గనైజేషన్‌లో చే రాను. ఎన్నో సమస్యలతో ఉండేవాడిని. బాబాను దర్శించుకుని ఆయన సందేశం విన్నాక నాలో ఎంతో మార్పు వచ్చింది. అందుకే జీవితాంతం బాబా సేవలోనే ఉండిపోతా. ఎంతో మంది నాలాగే సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన సేవలు చేస్తున్నారు. వారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారంటే మీరు నమ్మరు.
- చంద్రశేఖర్, మామిళ్లకుంట క్రాస్


బాబా ఉత్తరం ముక్క ఇచ్చారు.. ఉద్యోగం వచ్చింది
బాబా నాకన్నా నాలుగేళ్లు పెద్దోడు. 1956 నవంబర్ 12న బాబాను కలిసి నాకు ఉద్యోగం ఇప్పించాలని కోరాను. నేను చదివింది ఎస్‌ఎస్‌ఎల్‌సీ మాత్రమే. అయినా సరే బాబా ఒక ఉత్తరం ముక్క రాసిచ్చారు. దాన్ని బెంగళూరుకు తీసుకెళ్తే అక్కడ నాకు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్‌లో క్లర్క్ పోస్టు ఇచ్చారు. ఆ తర్వాత నాలుగేళ్లకు మా ఇంట్లో పరిస్థితులు సరిలేక ఆ ఉద్యోగం వదులకుని వచ్చేశాను. తిరిగి బాబాను కలిసి విషయం చెప్పాను. మా ఊరి జనానికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరాను. వెంటనే 53 మందికి ఇళ్లు కట్టించి ఇచ్చారు. నా కొడుకు పెళ్లి శుభలేఖ బాబాకు ఇస్తే ఆ పెళ్లికి పట్టు వస్ర్తాలు పంపారు. అవి ఇప్పటికీ దాచుకున్నాం. బాబా ఆరోగ్యం సరిలేదని తెలిసినప్పటి నుంచి అన్నం మెతుకు దిగడం లేదు. బాబా దానధర్మాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉంటూ భక్తులకు దివ్య సందేశం ఇస్తూ ఉంటే దారిద్య్రం తొలగిపోతుంది.
- లక్ష్మిరెడ్డి, నాగేపల్లి, కర్ణాటక   


పైన లక్ష్మీరెడ్డి గారిని సేవచేయమని ఎవరు చెప్పారు? ఆ సేవాదృక్పధాన్ని మనసులో నాటిందేవరు? అంతేనా?


మన రాజధాని హైదరాబాదులో బాబా భక్తులు లక్షల్లో ఉన్నారు. వారు చేసే సామాజిక కార్యక్రమాలు:


౧.శివం వీధిలో ఉన్న బాబావారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యసహాయాలు, విద్యా కార్యక్రమాలు, అన్నదానం, మురికివాడల్లో స్త్రీ శిశుసంక్షేమం  
౨.నగరంలో ఇరవైఏడు బాబా సమితులు, ఇందులో మూడు వేలమంది స్త్రీ పురుష సభ్యులు స్వచ్చందంగా, నిస్వార్ధంగా, మతాలకతీతంగా సేవలు అందిస్తున్నారు. 
౩.బాబా వారి అత్యున్నత వైద్యశాల ద్వారా ఏంటో మందికి గుండెశస్త్ర చికిత్సలు, నేత్ర చికిత్సలు అందిస్తున్నారు.      


ఇప్పడు బాబాగారికి వైద్యం ఎందుకనేవారు అప్పుడు బాబావారు వైద్యశాలను కట్టించేప్పుడు ఎందుకని అడగలేదే౦?


హే.వా: ఎహే.. నువ్వెంతమొత్తుకున్నా పైవాళ్ళంతా గొర్రెలు... అందుకే అలా చెబుతున్నారు! నేను సత్యాన్ని!


వా.వా: అంతలా బాబా తన వాక్కుల ద్వారా మనిషికి మంచి చెడ్డలు తెలియచెప్పటం, లేనివారికి సాయం చేయడం వల్ల ఏంతోమందికి అభిమానపాత్రుడయ్యాడు. ఒక శక్తిగా ఎదిగి అందరిచేతా మంచిపనులు చేయిస్తున్నాడు. అలాంటి శక్తి యొక్క మంచి చెడ్డలు సమాజానికి ఏంతో అవసరం, ఎలాగైతే మన కుటుంబ౦లో ఎంతమంది ఉన్నా అమ్మా/నాన్నలు ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో! ఇక్కడ సామాన్యుడితో పోలిక పెట్టడం అవగానరాహిత్యం, తమ ఉనికికై గతకడం!        


వి.వా: మీ బాబాకి బాగలేకపొతే వాళ్ళ ఊళ్ళోవాల్లే పట్టించుకోలా. మధ్యలో మీరే౦ది?
    
స.మ: ఎవరు నీకు చెప్పింది? నోరా అది లేక నాపరాయా? మాది అదే ఊరు... ఏం? కనపడట్లా? ఊరంతా వల్లకాడయినట్లు ఎక్కడోల్లక్కడ చడీచప్పుడు చేయకుండా నిద్రాహారాలు మానేసి ఆ సామికి బాగవ్వాలని కోరుకుంటు౦టే కళ్ళు దొబ్బాయా?


వా.వా: ఒక్క ఆయన ఊరనే కాదు, దేశవిదేశాల్లో ఉన్న ఆయన భక్తులు, ఆయన చేత సాయం పొందినవాళ్ళు ఏంతోమంది పుట్టపర్తికి చేరుకున్నారు. చేరుకోలేనివారు ఫోన్లు చేయడం, వారికి తగ్గట్టుగా ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నారు. పక్కరాష్ట్రలోని బళ్లారి నగరంతో పాటు జిల్లాలోని హొస్పేట, సండూరు, కూడ్లిగి, హడగలి, కంప్లి తదితర నియోజకవర్గాలలోని పలు గ్రామాల్లో ఆయన భక్తులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇవి కేవల౦ మన ప్రచారమధ్యామల వల్ల తెలిసినవి మాత్రమే!




వి.వా: అసలా పుట్టపర్తి నివాసంలో ఎన్ని దారుణాలు.. ఎన్ని హత్యలు జరిగాయో! వాటికి నా దగ్గర ఆధారాలు లేవుగానీ అగో అల్లక్కడ ఎల్లయ్యని, ఈ పక్క బుల్లయ్యని అడిగితే చెబుతారు.


దా.దా: పిచ్చి వి.వా! ఆధారాలు అడుగుతాఅని ముందే ఎల్లయ్య, పుల్లయ్య అని చెబుతున్నావే!  మరి నువ్వుకూడా మీ ఇంట్లో చిన్నపిల్లల చేత పనిచేయిస్తున్నావనీ, మీ భార్యని అనుమానంతో చిత్రవధ చేస్తున్నావని అదే ఎల్లయ్య, పుల్లయ్యలు చెప్పారు. మరేవంటావు? అధారాల౦టవా.. ఆళ్ళకి తెలుసుగా ..ఒప్పుకో!


వా.వా: ఈ హత్యలూ.. దారుణాలు అంతా పుక్కిటిమాటలు, ఆధారలేమితో కూడుకున్నవి.. పైపెచ్చు భావదాస్యం!. తన ధనబలంతో ప్రపంచాన్ని ఏ విధంగా ఆయితే మాయ చేసి తనకు తగ్గట్టుగా చరిత్రను రాయిచుకుందో అదే క్రైస్తవం తన మతప్రాభవం కోసం పలుకుబడి ఉన్న బాబామీద తన కనుసన్నల్లో మెలిగే ప్రచారమిధయమాలతో అసత్యారోపణలు గుప్పించింది. కానీ సామాన్యప్రజలకి "సత్యం" తెలుసు. వారి ఆరోపణలు పెరిగేకొద్దీ స్వామివారి భక్తులూ పెరిగిపోయారు. ఏంతోమంది విదేశీయులు బాబావారిని పరీక్షిద్దామని వచ్చి ఆయన ప్రశాంతవదనచిత్తానికి దాసులుగా, ఆయన భక్తులుగా మారి ప్రజలకు సేవచేస్తున్నారు. డబ్బుకోసం ఎంత ట౦పెతినైనా నిరాధార వార్తలను ప్రచారం చేసే ఆంగ్లమాధ్యమాల్లో మొదటిగా ఉండే బి.బి.సి బాబా వారి మీద చేసిన పరిశోధనలు పిచ్చిమొక్కలుగా మిగిలిపోయాయి. ఈ హే.వాలు ఆ కలుపుమొక్కల ని తమ కడుపు నింపడం కోసం వాడుకోవడం అత్యంత హేయమైనది, అశుద్దభక్షక౦ .


స.మ: నిజమే, ఈ అసత్యారోపణల గురించి మాట్లాడ్డానికి, రోజుల తరబడి వాది౦చుకోవడానికి నేనేం కడుపునిండిన హే.వా ని కాదు. ఒక సగటు మనిషిని!


హే.వా: చెప్పా గదా! మీరు గొర్రెలు.. గొర్రెలు..


దా.దా: రే గాడిదా.. ఒప్పుకున్నాం కదా నువ్వు ఒక గాడిదవని!


వాస్తవ వాది: చివరగా ఒక మాట! క్రైస్తవసామ్రాజ్యానికి  దేవదూతగా చెప్పుకునే పొప్ జాన్ పాల్ II తన జీవిత చరమా౦కమంతా ఆసుపత్రిలో జీవిస్తూ చనిపోయాడు. వీరి సువార్తీకులు మటుకు పేదప్రజలకి వైద్యావసరం లేకుండానే జబ్బులు నయం చేస్తామని ప్రపంచదేశాలని మోసం చేస్తున్నారు. ఈ భారతీయ హే.వా ల్లో పొప్ ఆసుపత్రి ముక్క గట్టిగా ప్రచారమాధ్యమాల ద్వారా అడిగినవాడు లేడు!


హేటు  వాది:  మీ బాబా  95 ఏళ్ళు బతుకుతా అని చెప్పాడు. ఇప్పుడు ఎవయింది?


దారినపోయే దానయ్య : రే హేటు, నేనూ చివరిగా ఒకటి చెపుతున్నా .. ఆ గాడిదచెవులిటేసుకో! బాబామీద నీవు చేసే ఆరోపణలకి ఆధారాలు లేవు, గాలి మాటలు తప్ప. కానీ బాబాగారు పేదవారికి చేస్తున్న సేవకి కావలసిన ఆధారాలు ఉన్నాయి. మాకు అవి చాలు. మూలం అ౦టే   నిర్మూలం అని పలికే నీలాంటి వారి ఆటలిక చెల్లవుపొ!.


సగటు మనిషి: బాగా చెప్పావు దానయ్య, అయినా గొర్రె ఏడిస్తే తోడేలుకు విచారమా! ఇంగితజ్ఞానం ఉన్న సాటిమనిషిగా బాబాగారు  అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని మరింతమందికి చేయూతనివ్వాలని కోరుకుందాం రండి.


    


...........Will keep on updating as time goes on!

Tuesday 5 April 2011

ఓ శాంతి కపోతమా, నీ జాడెక్కడ?

శాంతికి చిహ్నమైన శాంతి కపోతం ఎక్కడు౦ది?


అరబ్బుల ఆయిలు నిక్షేపాలను ఆక్రమి౦చుకొనుటకై పశ్చిమదేశాలు వేస్తున్న ప్రజాస్వామ్యపు ఎత్తుగడల్లో!.
లక్షలకోట్లమారకం చాటున జరిగే సామ్రాజ్యవాదుల సయాటల్లో, ప్రచారమిధ్యమాల అతిశయోక్తులలో !.










ప్రపంచీకరణ విపణి విచక్షణ మరిచి    
మరీ విహంగ వీక్షణం చేస్తు౦టే 
ఓ శాంతి కపోతమా
నీ జాడెక్కడ? 


పెట్టుబడిదారుల పెత్తందారీలో
సామ్రాజ్యవాదుల సయ్యాటల్లో
నీవు శాంతిభ్రమల్లో మునిగితేలుతున్నావని తెలిసి
నిన్ను రక్షి౦చుటకై వెతుకున్నా!    


ప్రచారమాధ్యమాలు తమ 
మిధ్యాప్రపంచపు మత్తుగడకి నిన్ను 
పావుగా వాడుకుంటూ పబ్బం
గడుపుకుంటున్నాయని తెలిసి
నిన్ను తప్పి౦చాలని ఆరాటపడుతున్నా! 


మానవహక్కుల మాదాకవళపు 
శాంతికొలుపుల మారణకాండలో 
నీవెక్కడ కబేళ౦గా మారతావోనని
భయంతో బరువెక్కిన హృదయంతో 
నీ జాడ చెప్పమని అర్థిస్తున్నా!       


సగటుమనిషిని పీల్చిపిప్పిచేసే
ధనరాబందుల మొండి గోడల్లో 
అందమైనబొమ్మలా మిగలిపోతున్నావని 
అ అధునాతన మదపంజరం ను౦చి
నీకు స్వేచ్చనివ్వాలని వారిముందు సాగిలపడుతున్నా!   

ఓ శాంతి కపోతమా చివరగా ఒక మాట!
నన్ను 
నీ ఆస్థిత్వాన్ని ప్రశ్నించిన దేశద్రోహి అన్నా   
నీ జాడకై వెతుకుతున్న శత్రుగూఢచారిగా భావించినా  
నిన్ను చేరుటకు నే వేగిరపడుతూనే ఉంటా


ఎందుకో తెలుసా?
రేపటిరోజున 
ఓ శాంతికపోతమా, నీ చావెక్కడ? 
అన్న ప్రశ్న ఉదయిస్తే తట్టుకునే 
శక్తి నాకు లేదు కాబట్టి.

ఓం సహనావవతు ,
సహనౌ భుజన్తు,
సహవీర్యం కరవావహై,
తేజస్వి నా వధీతమస్తు,
మావిద్వాషావహై ,
ఓం శాంతి: శాంతి: శాంతి:











బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers