గొర్రెదాటు ధోరణి, గురివింద నైజం నేటి లోకం పోకడ
సమాజ కుతర్కమెరుగని గొర్రె తనని మహాగొప్పగా మేపుతుంటే అదంతా తన మీద ఉండే అభిమానం అనుకుంటుంది. ఆయితే తనకిచ్చిన కండబలుపు మరొకరి శరీరబలుపుతత్వం నింపడం కొరకే అన్నది గ్రహించేలోపే బలిపశువయ్యు౦టుంది. మరి దీన్ని గమనించిన మిగిలిన గొర్రెలు ఏవైనా సామాజిక పాఠాలు నేర్చుకుంటాయా అంటే అది శూన్యం. ఎందుకంటే అలా బలిపశువవ్వడం తమకు తరతరాలనుంచి వచ్చిన గొప్పవారసత్వంగా భావించడమే. భావించడమే కాదు ప్రతిఘటించలేని తమ జడత్వానికి మంచితనమనే మందమైనబొచ్చు కప్పి మురిసిపోతూ తమ వారసులకు అదే జడత్వాన్ని అందించడానికి సిద్దమవుతుంటాయి. ఆవిధంగా గొర్రెలు తరతరాలుగా మోసపోతూ ముందుకుపోతూ ఉంటాయని మరి నేను మనవి చేసుకుంటున్నా. నిజవే.. పాపం బుర్రలేని గొర్రెలు మోసపోవడం బలిపశువులవ్వడం సహజమే. మరి బుర్ర ఉండి ఉన్నత చదువులతో ఊరేగే మడిసి మాటేమిటి?
"గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి. గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి" అని అన్నారు సమాజాన్ని క్షుణ్ణంగా చదివిన ఓ సినీరచయిత. ఇక్కడ జ్ఞానం అంటే పట్టాలు,పచ్చళ్ళు(PhD) కాదు. వాదాలు,వర్గాలు, వైరాగ్యాల మీద పట్టు అంతకన్నా కాదు. సమకాలీన సామాజిక పరిస్థితుల మీద అవగాహన పెంచుకొని ఆచరణలో తర్వాతి తరాలకు ఆదర్శమవ్వమని అర్ధం. ఆయితే ముందుగా చెప్పుకునట్లు గొర్రెగా బతకడం అలవాటు చేసుకున్న తరాలని ఎత్తిచూపుతూ "వారు గొర్రెదాటు మందే.. ఇక మీ సమాజబోధ దేనికని" అని మొహంమీద కొట్టినట్లు అడిగి కడిగి వదిలిపెట్టారా సామాజిక రచయిత. గొర్రెదాటు ధోరణి, గురివింద నైజం నేటి లోకం పోకడని చెప్పకనే చెప్పారు.
ఇంతకీ "గొర్రెదాటు" అంటే? జీవితాన్ని కొనసాగించడానికి గొర్రెలకు పెద్దగా తెలివి'తేట'లు,పట్టాలు, పచ్చళ్ళు ఉండాల్సినవసరం లేదు. ఉదాహరణకి, ఒక గొర్రెలగుంపు వ్యాహాళికి వెళుతుంటే వాటికో అడ్డు(కంప/ఏదైనా) వచ్చింది. అప్పుడు గుంపుమొదట్లో ఉన్న గొర్రె అడ్డుమీదనుంచి ముందుకు గెంతుతుంది. ఇంతలో అది గమని౦చిన గొర్రెలకాపరి అడ్డు తొలగిస్తాడు. ఆయితే అప్పటికే ముందున్నగొర్రె అడ్డును ఎలా దాటిందో గమనించిన మిగిలిన గొర్రెలు తరువాత ఒకదాని వెంట మరొకటి అదే విధంగా గెంతుతూ దాటుతాయి అక్కడ అడ్డేమీ లేకపోయినా కూడా. ఇదీ "గొర్రెదాటు వైనం". మరైతే ఏందయ్యా నీ గొర్రెగోల అంటారా? అక్కడికే వస్తున్నా... సదరు సామాజిక సినీరచయితగారు చెప్పినట్లు గొర్రెదాటుగా అనుసరించడం, గుడ్డిగా జీవితాన్ని గడపడంలో తెలివిగల మడిసికి, తెలివిలేని గొర్రెలకూ ఆట్టే పేద్ద తేడా కనిపించదు. రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి ఇక్కడ. మొదటిది "అక్కడొక అడ్డు ఉంది" అన్నమాట వాస్తవం అని తెలుసుకోవడమైతే రెండవది తాము తొలుత కొంత కష్టపడైనా ఆ "అడ్డు" తొలగిస్తే తర్వాత వచ్చే తరాలు అనవసరంగా శ్రమించాల్సిన(కష్టపడి గెంతాల్సిన) అవసరం ఉండదనీ..గొర్రెలుగా బతకాల్సిన అవసరం అసలే ఉండదనీ..గుర్తించడం. ఇహ ఒకవేళ ఎవరైనా సామాజికమంటూ సలహా ఇస్తే తమ గొర్రెదాటుకి భుజాలు తడుముకోవడమేకాక పైపెచ్చు మా ముందుతరం కూడా ఇలానే మోసపోతూ గొర్రెదాటు జీవితం బతికింది. మేం కూడా అలా బతకడంలో రెండాకులు ఎక్కువే తిన్నాం అంటారు. అలా అనడమే కాదు ఆ రెండాకులతో ఓ ముళ్ళకిరీటం తయారుచేసి తమ తర్వాతితరాల నెత్తిన పెట్టడానికి సిద్దమవుతుంది. ఇహ "ఇదేలే..తరతరాల గొర్రెదాటు చరిత్ర.. మూలిగే జీవితాల మథనం" అంటూ పాడుకోవాలి. ఇదీ సంగతి.
ఉన్నతచదువులు చదివి నవనాగరికం మాసొత్త౦టూ డొప్పాలు కొట్టుకుంటూ గొర్రెదాటు జీవితాన్ని, తాత్కాలిక లాభాల కోసం బలిపశువలయ్యేవిధానం మీద ఒక ప్రత్యక్ష్య ఉదాహరణ ఇచ్చి ఈ "గొర్రెదాటు" తనానికి స్వస్థి చెప్పే ప్రయత్నం చేస్తా :)
లండన్ మహానగరం. ఈ శతాబ్డపు ప్రపంచీరణకు(golbalization) సరికొత్త నమూనాగా భాసిల్లుతూ, యూరప్లోనే అత్యంత విలాసవంతమైన నగరంగా, రోజుకు కోట్లకొద్దీ వర్తకమారకం జరిగే పేరున్న లండన్లో ఒక సంవత్సరకాలం పైగా జరుతున్న మోసం..కాదు వ్యాపారం..బలిపశువలయ్యే విద్యావంతుల గొర్రెదాటు గొప్పతనం.
"ఆక్స్ఫర్డ్ సర్కస్" ఇది లండన్లోని ప్రముఖవీధి. అన్ని ప్రముఖ సంస్థల దుకాణాలతో నిత్యం యాత్రికులు,వ్యాపారరద్దీతో ఉంటుంది. ఇదే వీధిలో సుగంధపరిమళాలు అమ్మే అంగడి ఒకటి.. ఎప్పుడూ ఆడో/మగో ఎవరోఒకరు మైక్ పట్టుకుని పెద్దగా అరుస్తూ దారినపోయే జనాలను తమ కొట్టు(డు)కి ఆహ్వానిస్తూ ఉంటారు. నేను ఉద్యోగశాలకి పోవడం, రావడం ఇదే దారిలో కనుక నిత్యం గమనిస్తుండేవాడిని. మామూలుగా అరిస్తే ఎవరొస్తారు..అందుకని ఆకర్షణ కింద "ఐపాడ్లు,ఐఫోన్లు,కెమెరాలు ఉచితం..ఉచితం" అంటూ కేకేస్తారు. ఇక ఉచితం అనగానే చేరిపోయే గొర్రెదాటు మందకి ఓ పది ఐఫోన్లు,కెమెరాలు పడేసేవారు. ఆగండాగండి..అవి చైనావారి తయారీ మార్కు బొమ్మలు మాత్రమే ;). వీళ్ళు నిజంగానే ఏవో ఇస్తారని వచ్చిన మందకి తాము మోసపోయామని అర్ధం అవుతుంది. ఆయితే ఇది అర్ధమయ్యేలోపే ఆ అరిచేవాడు "150 పౌండ్ల విలువచేసె అయిదు సుగంధపరిమళాలు కేవలం 20 పౌండ్లు మాత్రమే, ఈ సువర్ణావకాశం ఈరోజు మాత్రమే" అంటూ మోసపోయిన మందని మరింతగా ఆకర్షించి బలిపశువులని చెయ్యడానికి ప్రయత్నిస్తాడు తన మాటల గారడీతో. ఒకవేళ తన గారడీ పనిచెయ్యటం లేదని గ్రహించగానీ కొనేవాళ్ళ గుంపులో ఉన్న తన తైనాతీలకి సైగ చేస్తాడు. ఈ తైనాతీలు అమ్మేవాడితో తమకే సంబంధలేదన్నట్లుగా నటిస్తూ వాడిచ్చిన సువర్ణావకాశం మళ్ళీ రాదనట్లు ఎగబడి కొనుక్కుంటారు. ఇహ అప్పుడు మొదలవుతుంది..గొర్రెదాటు మందలో చలనం. ఒకరి తర్వాత ఒకరు "ఆలసించిన ఆశాభంగం" అనుకుంటూ 20 పౌండ్ల సుగంధపరిమళాల సువర్ణావకాశాన్ని కొనేసుకుంటారు. ఆయితే అమ్మేవాడు అక్కడితో ఆగుతాడా.. ఇవి ఆడవారికి..అవి మగవారికి..అంటూ కొనేవాళ్ళని మరింత రెచ్చగొడుతూ ఎంతలేదన్నా ప్రతిగొర్రె నుంచి 40 పౌండ్లు రాబట్టుకుంటాడు. ఇక ఈ గొర్రెదాటుమంద పోయిన తర్వాత మరో మంద సిద్దంగా ఉంటుంది. ఈ విధంగా వ్యాపారాన్ని గొర్రెదాటు మందలున్నంతసేపూ నిరాటంకంగా సాగించే వారి వ్యాపారాన్ని కింద ఛాయాచిత్రంలో చూసి గొర్రెదాటుకి ఉన్నతచదువుకి తెలివికి సంబంధం అస్సలు ఏమీ ఉండదని తెలుసుకొనగలరు ;).
గొర్రెలవరో చేతులెత్తండి? ;) |
నాన్దాడ నల్లగొర్రె! రొంబ ఉచితమాయే ;) |
మరీ ఇన్ని చదువుకున్న గొర్రెలా ? పర్లేదు నా యాపారానికి ! ;) |