నిజం..నిర్భయం

Thursday, 21 April 2011

సాయంసంధ్యా సమయమిది..సాయం చేయగ కదలండీ! - 1



సాయంసంధ్యా సమయం! ఎంత అధ్బుతమైన పదం. తనవారికి, పరులకి సాయంచేసే సంతోషాన్ని పంచుకునే సంధ్యాసమయమని అనిపించట్లేదూ?దాని అర్థం ఇది కాదయ్యా అంటారా? అయితే చదవండి మరి:)


ఉదయసంధ్య హడావుడితో, ఉరుకులపరుగులతో మానవపశుపక్ష్యాదులుకి తీరిక ఉండదు, ఎవరి వృత్తులకి వారు వెళ్ళే సమయమది.

అదే సాయంసంధ్యా సమయమో:
పగలంతా కష్టపడి పొలంపనుల నుండి సాయంకాలానికి ఇల్లు జేరిన  రైతన్నలు తమ పొలంలో తొలిగా పండి౦చిన లేలేత సజ్జ/రాగి/జొన్న కంకులను ఇతరులకి  పంచే సమయం.  గొర్రెలు/మేకలు కాయడానికి కొండకేసివెళ్ళిన గొల్లలు ఆ కొండలలో ఆ ఋతువులలో దొరికే ప౦డ్లు(రేగి/కలే/జువ్వి) తమ పిల్లలికి, వారి దోస్తులకి పంచే సమయం.ఉదయమనంగా వెళ్ళిన పక్షులు కిలకిలారావాలతో తమతమ గూళ్ళకి చేరి తాము తెచ్చిన ఆహారాన్ని, ఆశగా ఎదురుచూస్తున్న పిల్లలకి ముద్దుగా తినిపించే సమయం. ఆవులు ఆబగా ఇంటికి చేరి, అంబా అంటూ ఆవురావురుమని ఎదురుచూస్తున్న లేగదూడని ముద్దుగానిమిరి పాలిచ్చేసమయం. బడి ఎగ్గొట్టి మరీ కొండలకేసిబోయిన పిల్లలు రేగిపండ్లు/చింతపువ్వు/చింతకాయలు తీసుకువచ్చి ఒక్కరే తినకుండా తమ దోస్తులని పిలిచి పంచుకుని మరీ తినే సమయం. వీధికి  ఆ కొనాకు ఉన్న లచ్చుమమ్మ ఏం ఎల్లమ్మా పిల్లాడు ఎందుకేడుస్తాన్నాడు అంటే ఈ కొనాకు  ఉన్న ఎల్లమ్మ ఇప్పుడే పొలంనుంచి వచ్చానక్కా...చిన్నోడేమో ముక్కలేనిదే ముద్ద దిగదని ఏడుస్తున్నాడని చెబితే, ఉందా/పెట్టమని ఎల్లమ్మ అడక్కుండానే .. ఓ అదా విషయం ఈరోజు మా ఇంట్లో ముక్కలేలే, ఇదిగో మా పిల్లోడికిచ్చి  ఇప్పుడే పంపిస్తున్నా అని లచ్చుమమ్మ తనకున్నదాన్ని ఇతరులకి పంచుకునే సమయం. ఆ రెండు కొనాకుల మధ్య ఇంట్లో ఉన్న నేను అమరికలు లేని ఆ ఆప్యాయతపు మాటలను వింటూ ఆనందించే సమయం. ప్రేమ, ఆప్యాయతలు ఎలా పంచిపుచ్చుకోవాలి అన్నది పెద్దలనుంచి గమనించి పిల్లలు నేర్చుకునే సమయం.


ఇక మా ఇంటికి వస్తే ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు పనిచేసి కాసేపలా నడుమువాల్చి, పక్షుల కిలకిలారావాలతో నిద్ర లేచి గృహలక్ష్మిలా తయారయ్యి తన కుటుంబం కోసం మా మాతృమూర్తి మళ్ళీ శ్రమించే సమయం. ఊరికి దూరాభారంగా ఆరేడు మైళ్ళ దూరంలో ఉన్న బడికి నడుచుకుంటూ/సైకిల్ తొక్కుంటూ వెళ్లి, చదువు చెప్పి తిరిగి వస్తూ పిల్లలికి తన బడలిక తెలీకుండా ఆనందాన్ని మొహ౦మీద, తాయిలాలను చేతిలోనూ పెట్టుకు వచ్చిన నాన్నగారు వాటిని పిల్లలకిచ్చి వారితో ఆనందాన్ని, ఆప్యాయతని పంచుకుని పెంచుకునే సమయం. అప్పుడే బడి నుంచి వచ్చిన అక్కలు/అన్నలు తాము కొనుక్కున్నదానిలో కొద్దిగా దాచిఉంచి చిన్నతమ్ముడినైన నన్ను గారంగా ఆటపట్టిస్తూ తినిపించే సమయం.

మొత్తమ్మీద ఇదో శ్రామిక సౌందర్యం.అయితే ఈ శ్రామిక సౌందర్యం కేవలం కష్టపడ్డంతోనే ఆగిపోలేదు. తాము కష్టపడి సంపాందించినది లేదా ఉన్నది  తనవారికి/తోటివారికి పంచుకోవడంలోనూ ఈ శ్రామికసౌందర్యం అంతర్లీనంగా వ్యాపించిఉన్నది. వెరసి శ్రామిక సౌందర్యపు పుట్టింటి నుంచి సారెగా వచ్చిన "సాయ" చీరను కట్టుకుని సంధ్యాదేవి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ తన ఆనందాన్ని సప్తవర్ణాల అంచుతో ప్రపంచానికి ప్రకటించే సమయమది.

ఇవన్నీ ఒక ఎత్తయితే తన సొంతలాభ౦ ఎంతమాత్రం లేకు౦డా పగలంతా వెలుగునిస్తూ వారి కష్టసుఖాలను కళ్లారాచూస్తూ బాధను పంచుకుంటున్న సూరి మామ ఇక తానూ విశ్రమించే వేళయిందని పున్నమి వెలుగుల చల్లదనాన్ని పంచమని చందమామని రారమ్మని పిలిచే సమయం.

సాయంసంధ్యలో అంత సాయపు మహత్తు ఉంది మరి!. ఆ విధంగా తనవారికీ, ఇతరులకీ సాయం చేసి ఆనందం పొందడం అనేది భారతీయ జీవనవ్యవస్థలో తనదైన రూపులో మిళితమై ఉందని కొత్తగా తనకి సాయసూత్రాలు ప్రత్యేకించి చెప్పనవసరంలేదని గట్టిగా చెబుతుంది.      

ఆయితే పైన చెప్పిందంతా గతించినకాలపు గుర్తులు అని అందరూ ఒప్పుకుంటారు. నిజమే.. ఆ అభిమానాలు, ఆప్యాయతలు(అ.ఆ) చాలావరకు గతించాయి. సాయం సన్నగిల్లింది.  ఇచ్చిపుచ్చుకునే  వ్యవహారం కేవలం  వ్యాపారధోరణిగా, అవసరమయినప్పుడు మాత్రమే పుట్టుకువచ్చే అభిమానాలు..ప్రేమలో కొత్తపుంతలు.

మరిప్పుడు ఏవిట్టా అని అడుగుతారా? చెబుతా..ఈ టపాకి అనుబంధ టపాలో వివరిస్తా .. "అలాంటి" సాయంసంధ్యాసమయాన్ని ఇతరులకి మనం పంచడానికి ఆసన్నమైన అవసరాన్ని గురించి :).

మరి  సాయం చేయగ కదులుతారా?

17 comments:

Sravya V said...

రాజేష్ మీరు సామాన్యులు కాదండి ! భలే చెప్పారు సాయంత్రం వేల గురించి , ఎలా అయినా రెండు పార్టులు రాయాలి అనుకున్నపుడు ఇంకొంచెం వివరం గా రాసి ఉండొచ్చేమో .
నెక్స్ట్ పార్ట్ లో ఏమి సాయం కోరబోతున్నారో అని ఎదురు చూస్తున్నాను .

Rao S Lakkaraju said...

ఊరికి దూరాభారంగా ఆరేడు మైళ్ళ దూరంలో ఉన్న బడికి నడుచుకుంటూ/సైకిల్ తొక్కుంటూ వెళ్లి, చదువు చెప్పి తిరిగి వస్తూ పిల్లలికి తన బడలిక తెలీకుండా ఆనందాన్ని మొహ౦మీద, తాయిలాలను చేతిలోనూ పెట్టుకు వచ్చిన నాన్నగారు
------------
కఠెవరం లో మా వాళ్ళూ అంతే. ఎందుకు ఆ అందరికీ చదువు చెప్పటానికి అలా జీవితం ధార పోశారు? తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అని తెలేదు కామోసు. అయినా ఫరవాలేదు ఆ చదువు నేర్చుకున్న వందల మందిలో ఏ కొద్ది మందయినా తోటి మానవుల జీవితాలని బాగుచేయ కలిగితే వాళ్ళ కష్టాలు ఫలించినట్లే.

Anonymous said...

"ఆయుధమున్ ధరింప అని నిక్కముగా ఒకపట్ల ఊరకే సాయము సేయువాడ ....ఆఆ.)))).ఆ..))))ఆ..)
ఆయుధమున్ ధరింప "

:)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

సాయం సంధ్య కి ఎంత చక్కటి నిర్వచనం !!
నిజం చెప్పారు. చాలా హృద్యంగా చెప్పారు.

Anonymous said...

అబ్బ.. ఎంత బాగా చెప్పారండి సాయంసంధ్య గురించి. మరిక సాయం గురించి ఏమి చెప్తారా అని నేనూ ఎదురుచూస్తున్నా.

థాంక్స్.


రాధిక

Anonymous said...

One of the very nice and best post from you. Keep it up.

రాజేష్ జి said...

$Sravya Vattikuti గారు

:))

#..ఇంకొంచెం వివరం గా రాసి..

హ్మ్.. సాయంసంధ్య గురించి ఎంతైనా రాయొచ్చు :). నేనూ నాకు అనిపించినదంతా రాసాను.. షరా మామూలుగానే చాలా పెద్దదై కూర్చుంది :). అయితే కుమార్ గారిచ్చిన సలహా ప్రకార౦ కుదించి మధ్యస్తానికి తెచ్చి ప్రచురించా :)

#..ఎలా అయినా రెండు పార్టులు..

రెండు భాగాలు అనుకుంది ఒకదాని వల్ల మరొకదాని ప్రభావ౦ తగ్గకూడదని :). అంటే సాయంసంధ్య అంటూ మొదలుపెట్టినా నా ముఖ్యఉద్దేశ్యం "సాయం" గురించి చేబుదామనే! రెండూ ఒకే టపాలో పెడితే సాయంసంధ్య ముందు సాయం సూర్యాస్తమయం అవుతుందేమోనని రెండు భాగాలు అంటూ చెప్పుకొచ్చా :)


అన్నట్లు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు :).

రాజేష్ జి said...

$Rao S Lakkaraju గారు

#..చదువు చెప్పటానికి..జీవితం ధార పోశారు?..

ఇలాంటి ప్రశ్నలకి కేవలం నేటి వ్యాపారధోరణి చెప్పేది "ఎవరి కోసం? డబ్బులకోసం కాదూ" అని బుగ్గలూ, ఇంకా ఎవైనా ఉంటే అవీ నొక్కుంటూ కూర్చుంటూ రాగాలు తీస్తారు. మా నాన్నగారు పదవీవిరమణ చేసే వరకు అదేఊరికి, అదేవిధంగా వెళ్లివస్తూ పనిచేశారు. ఉన్నఊరికి ఉద్యోగాన్ని బదేలీచేయించుకునే మార్గ౦ఉన్నా చేయించుకోలేదు. కారణం, ఆ ఊరితో పెంచుకున్న అనుబంధం ఒక కారణమైతే, తనుకూడా వెళ్లిపొతే అ ఊరి బడికలో చదువు చెప్పడానికి ఎవరూ రారేమో అన్న బాధ మరో ముఖ్యకారణం.

ఇన్నిచెప్పినా డబ్బు కోసమే అంటే, ఆ వచ్చేది ఉన్నఊరికి బదిలీచేయించుకున్నా వస్తుంది. అంతే కాకుండా కేవలం ఈ ఉద్యోగం మీదే ఆధారపడకుండా మా తాతగారి(అమ్మ నాన్న)తో కలిసి వైద్యం, పౌరోహిత్యం కూడా చేసేవారు. ఆయన ఆనందం అక్కడ ఆ ఊరిలో చదువుచెప్పడంలో చూసుకున్నారు..దానిముందు కష్టం కనిపించలేదేమో మరి :)

#..తిన్నింటి వాసాలు..తెలేదు కామోసు...

బాగా చెప్పారు. మీరిలా అంటే నాకో సంగతి గుర్తొచ్చే. ఆ ఊరి కామందు మా నాన్నగారి మీద కోపంతో(కారణాలు అనేకం!) సెలవుమీద ఉన్నప్పుడు తనవర్గపు వారితో గూడుపుటాణీ చేసి సత్సంబందిత మండలాధికారిని కలిసి బడికి సరిగా రావట్లేదని, చదువు చెప్పట్లేదని తీవ్ర ఆరోపణలు చేస్తూ పీర్యాదు చేసి ఉద్యోగ౦ నుంచి తీసివేయిచే వరకు తీసుకువెళ్లారు.

మా పెద్దక్క తొలి కాన్పుకి ఒంగోలుకి వెళ్లి వచ్చిన మాకు, ముఖ్యంగా నాన్నకి ఈ వార్త ఆయనకి తీవ్రమనస్తాపం కలిగించింది. చేయగలిగనది ఒక్కటే అని ఆ ఊరి వారికి విషయం చెప్పాడు. అంతే, అప్పుడు చూడాలి..ఆ ఊరిలో మిగలినవారంతా ఒక్కటయ్యి నాన్నకి బాసటగా నిలిచి మండలాధికారి పర్యవేక్షణకు వచ్చినప్పుడు సదరు కామందు(లు) చేసినవి తప్పుడు ఆరోపణలు అని చెప్పడమే కాక, ఇతనే మా బడికి పంతులుగారిగా ఉండాలి అని పిల్లలచేత చెప్పించడం.. అదో భావోద్వేగం. మొత్తమ్మీద కథ సుఖాంతం :)

మీరు అన్నట్లు వాసాలు లేక్కబెట్టే ఘనులూ, అవసరమైతే అసత్యారోపణ కూసాలు కదిలించి మరీ అభిమానాన్ని చూపేవారూ ఉన్నారు :)

#..ఫరవాలేదు..వందల మందిలో.. కష్టాలు ఫలించినట్లే..

చక్కటి మాట చెప్పారు.

అన్నట్లు మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు :)

రాజేష్ జి said...

$Snkr గోరు

#..ఆయుధమున్ ధరింప..

ఆహా..అవునా!. మరింకేం ఇవి అ౦దుకోండి మరి.

౧.ఆలము సేయనేనని యధార్దము పల్కితిసుమ్మిఆఆ ....ఆఆ.)))).ఆ..))))ఆ..)

౨.సేవాధర్మము సూతధర్మమును రాశీభూతమై ఒప్ప ....ఆఆ.)))).ఆ..))))ఆ..)

:))
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

రాజేష్ జి said...

$మందాకిని గారు

బ్లాగుకి స్వాగతం.

మీకు నచ్చినందులకు, అభిప్రాయాన్ని పంచుకున్నందులకు ధన్యవాదాలు.

$రాధిక గారు

ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు ఇలాగే మున్ముందు కూడా పంచుకోగలరని ఆశిస్తూ.. :)

$అజ్ఞాత గారు

హ్మ్.. మీ అభిమానానికి కృతజ్ఞతలు :)

Rao S Lakkaraju said...

@రాజేష్ జీ గారూ మనుషుల తత్వాలకి బాధేసింది.

నాకు చదువు వచ్చింది కార్పోరేట్ విద్య మూలాన కాదు. ప్రేమ భయభక్తులతో చదువు నేర్పిన పంతుళ్ళ మూలాన.

డబ్బుల కోసం పంతుళ్ళు చదువు చెప్పారు అనుకునే వాళ్ళు కోకొల్లలు. వాళ్ళని రోజూ చూస్తూనే ఉంటాము. తెలివితేటలు పుట్టంగానే వచ్చాయనుకుంటారు. పుట్టినప్పుడు మన తెలివితేటలు సున్నా. అవన్నీ ఎవరో దయతలచి మనకి ప్రసాదించినవే.

నాకు తెలివితేటలు పంతుళ్ళు ప్రసాదించారు అనుకునే వారు ఆణిముత్యాలు. వాళ్ళు త్వరగా బయటికి కనపడరు. మనందరి మంచికోసం ఏదో ఎప్పుడూ చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

KumarN said...

--"రెండూ ఒకే టపాలో పెడితే సాయంసంధ్య ముందు సాయం సూర్యాస్తమయం అవుతుందేమోనని రెండు భాగాలు అంటూ చెప్పుకొచ్చా :)"

హ హ హ కరక్టు. రైటి౦గ్స్ మొదలుపెట్టిన కొత్తలో మన౦దర౦ చేసే పనే అది, చెప్పదల్చుకున్నద౦తా గబా గబా అ౦తా ఒకేసారి, ఒకేదగ్గర చెప్పేయడ౦తో లిజనర్స్ తగ్గిపోతారు.

ఎనీవే, ఈ పోస్టు కళ్ళకీ, మనసుకీ ఇప్పుడిప్పుడే మాకు బయట కనపడుతున్న వస౦తకాల౦ రాకలా, చాలా ఆహ్లాద౦గా ఉ౦ది, పచ్చగా, కొత్తగా, బయటకెళ్ళి వస౦తకాల౦ గాలిలో ఇ౦కొ౦చె౦ ఎక్కువ సేపు తిరగాలనిపి౦చేలా!!!

మాలతి said...

రాజేష్ గారూ, నాకవితమీద మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఇప్పుడే చూస్తున్నా మీ టపా. సాయంసంధ్యని జీవనహేలతో చాలా చక్కగా కలిపేరు. కొందరు ఈనాటి రచనలలో నాస్టాల్జీ ఎక్కువయిందంటారు కానీ నాకు మాత్రం ఇలా పోల్చి చూసుకోడం అవసరమనే అనిపిస్తుంది ఈనాటి హడావుడిబతుకుల్లో, విజయసాధనకోసం తపన పడిపోతూ ముఖ్యమైన విలువల్ని మరిచిపోతున్నాం అని గుర్తు తెచ్చుకోడానికి. మీ తరవాతి టపాకోసం ఎదురు చూస్తున్నా.. అభినందనలతో - మాలతి

రాజేష్ జి said...

$మాలతి గారు

అడగగానే ఎలాంటి భేషజం లేకుండా వచ్చి, చదవి వ్యాఖ్యానించినందులకు మీకు
:: శతధాధన్యవాదాలు ::

#.. నాస్టాల్జీ ఎక్కువయిందంటారు..పోల్చి చూసుకోడం అవసరమనే..హడావుడిబతుకుల్లో,విజయసాధనకోసం తపన..ముఖ్యమైన విలువల్ని..

మీరు చెప్పినదానితో నేను పూర్తిగా అంగీకరిస్తాను. గతకాలపుస్మృతులు విలువైన విలువలని మోస్తూ వాటిని అనుభవించనవారికి తీపిగుర్తులుగా ఉండి అనుభవించని వారితో పంచుకునే అవకాశం. అట్లే ఇవేమీ తెలీని నూతనతరానికి "ఇలా ఉ౦డేవర్రా విలువలు!" అంటూ వారిలో ఆ విలువల ప్రాముఖ్యతను తెలుసుకునేట్లు చేయడ౦..ముఖ్యంగా అభిమానం, ఆప్యాయతలు మేళవించిన దొడ్డమనసు కలిగిఉండడం..!.

దీనికి అనుబంధటపా రాసినప్పుడు మీకు సమాచారమందిస్తా.

మీ వ్యాఖ్యకి మరోమారు ధన్యవాదాలు :).

రాజేష్ జి said...

$KumarN గారు

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు :))

మరలా వెళ్లి వసంతని పలకరించి వచ్చారా మరి? :)

రాజేష్ జి said...

$Rao S Lakkaraju గారు

మీరు చెప్పినది అక్షరాలా వాస్తవం. ఫక్తు వ్యాపారమాయమైన నేటి విద్యా'అ'వస్థలో గురు-శిష్య బంధం చేపలబజారులో చేపలు కొన్న చందం అయింది.
కనీసం మనకు చదువుబాట చూపి, విద్యామొలక నాటిన నాటి గురువుల యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవడం నైతికలక్షణం.

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు :)

Unknown said...

ee post naku baga nachindi nenu fb lo share chesukuntunna

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers